Home Uncategorized ‘అప్పుడే నేమ్‌ ప్లేటా?.. అది పిచ్చికి పరాకాష్ట’

‘అప్పుడే నేమ్‌ ప్లేటా?.. అది పిచ్చికి పరాకాష్ట’

అమరావతి: ఈవీఎంలపై చర్చ తప్పించుకునేందుకు ఈసీ కుంటి సాకులు వెతుకుతోందని మంత్రి దేవినేని ఆగ్రహం వ్యక్తంచేశారు. 31 కేసులున్న జగన్, 13 కేసులున్న విజయ్ సాయిరెడ్డి ఫిర్యాదులపై ఈసీ వెంటనే స్పందించడాన్ని ఆయన తప్పుబట్టారు. కేసు ఉందనే కారణంతో వేమూరు హరికృష్ణ ప్రసాద్‌ను చర్చకు వద్దంటున్నారని, ఈవీఎంలు ఏ విధంగా హ్యాక్ చేయొచ్చో చూపి అందరినీ అప్రమత్తం చేసినందుకే ఆయనపై కేసు పెట్టారని తెలిపారు. పీకే బృందం చివరి పేమెంట్ కోసం జగన్‌ని భ్రమల్లో ఉంచుతోందని, జగన్ అప్పుడే ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారు చేసుకోవటం పిచ్చికి పరాకాష్ఠ అని మండిపడ్డారు.

దేశ రాజధానిలో చంద్రబాబు చేసిన పోరాటం ఇతర పార్టీలను మేలుకొల్పిందని దేవినేని అన్నారు. పోలింగ్‌ని ఏ విధంగా ఆలస్యం చేయొచ్చో ఆంధ్రప్రదేశ్‌లో ఈసీ చేసి చూపిందని దుయ్యబట్టారు. ఓటింగ్ శాతం పెరగకుండా నియంత్రించే కుట్ర ఈసీ పన్నిందని ఆరోపించారు. అయినా ప్రజలు కసిగా ఓటింగ్‌లో పాల్గొని గట్టిగా బుద్ది చెప్పారన్నారు. తెలుగుదేశం సానుభూతిపరులు ఉన్న పోలింగ్ బూత్‌లోనే ఎక్కువ ఈవీఎంలు పనిచేయలేదని, మహిళలు అండగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని ఉమా అన్నారు.