Home పాలిటిక్స్ కాంగ్రెస్‌ ఓటమిని అంగీకరించినట్లే: స్మృతి ఇరానీ

కాంగ్రెస్‌ ఓటమిని అంగీకరించినట్లే: స్మృతి ఇరానీ

అమేఠీ (ఉత్తర్‌ప్రదేశ్‌): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై కేంద్రమంత్రి, భాజపా నాయకురాలు స్మృతి ఇరానీ విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 80 సీట్లుంటే వాటిలో దాదాపు 20 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేస్తోంది. తాము పోటీ చేసేందుకు రాష్ట్రంలో బలం లేదని, గెలిచే సత్తా లేదని ఆ పార్టీ నేతలు అంగీకరించినట్లు దీన్నిబట్టే తెలుస్తోంది. ఇక ప్రజలు ఆ పార్టీ వైపున ఎందుకు ఉండాలి. రండి.. ముందుకు వచ్చి భాజపాకు ఓటు వేయండి. 15 ఏళ్లుగా అమేఠీ ఎంపీ ఈ ప్రాంతానికి దూరంగా ఉంటున్నారు. ఆ ప్రాంతం గురించి పార్లమెంటులోనూ ఆయన ఎన్నడూ మాట్లాడలేదు. ఆ నియోజక వర్గంలో ఆయన ఇన్నాళ్లు అడుగుపెట్టలేదు. ఇప్పుడు ఆయన మళ్లీ నామినేషన్‌ వేసి, ఎన్నికల ప్రచారం కొనసాగించడం అవసరమా? ఇటువంటి నేత వల్ల ఉపయోగం ఏమిటీ?’ అని వ్యాఖ్యానించారు.

‘మే6న మీరందరూ కలిసి వచ్చి భాజపాకు ఓట్లు వేస్తే, ఫలితాలు వచ్చిన అనంతరం మే 24న నేను మీ వద్దకు వస్తాను. మీ శుభాకాంక్షలను స్వీకరిస్తాను. నేను అమేఠీలోనే ఇల్లు తీసుకుని ఉంటాను. మీ బాగోగులను తెలుసుకోవడానికి మీ మధ్యే ఉంటాను’ అని స్మృతి ఇరానీ హామీ ఇచ్చారు. కాగా, ఐదవ దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా అమేఠీలో మే6న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకుగానే కాంగ్రెస్‌ నుంచి మరోసారి రాహుల్‌ గాంధీ, భాజపా నుంచి స్మృతి ఇరానీ పోటీకి దిగుతున్నారు. ఇప్పటికే వారు నామినేషన్లు దాఖలు చేశారు.