Home జాతీయం నమోటీవీపై భాజపాకు దీల్లీ ఎన్నికల సంఘం ఆదేశాలు

నమోటీవీపై భాజపాకు దీల్లీ ఎన్నికల సంఘం ఆదేశాలు

దిల్లీ: ముందస్తు ధ్రువీకరణ లేకుండా ‘నమో టీవీ’లో ఎలాంటి కార్యక్రమాలు ప్రసారం చేయరాదని దిల్లీ ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు దిల్లీ ఎన్నికల ముఖ్య అధికారి ఈ ఆదేశాలు జారీ చేసింది.

‘నమో టీవీ’లో ప్రసారం చేసే ఎలాంటి రాజకీయ ప్రచారాంశమైనా దానికి తప్పనిసరిగా స్థానిక మీడియా సర్టిఫికేషన్‌ సంఘం, దిల్లీ మానిటరింగ్‌ కమిటీ ముందస్తు అనుమతి అవసరమని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం స్పష్టం చేసింది. అంతేగాక.. ముందస్తు ధ్రువీకరణ లేకుండా ‘నమో టీవీ’లో ప్రసారమవుతున్న రాజకీయ ప్రచారాంశాలను తక్షణమే తొలగించాలంటూ దిల్లీ ఎన్నికల ముఖ్య అధికారికి ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈసీ ఆదేశాల మేరకు.. దిల్లీ ఎన్నికల ముఖ్య అధికారి భాజపాకు ఉత్తర్వులు పంపారు.  ముందస్తు అనుమతి లేని ప్రసారాలను వెంటనే తొలగించాలని వీటిల్లో పేర్కొన్నారు. దీంతో పాటు నమో టీవీలో ప్రసారమయ్యే అంశాలను పర్యవేక్షించేందుకు ఇద్దరు అధికారులను కూడా నియమించారు. ‘నమోటీవీ’ ప్రసారాల తీరుపై కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ విధంగా చర్యలు చేపట్టింది.