Home ఆంధ్ర ప్రదేశ్ 50 శాతం లెక్కించడానికి అభ్యంతరమేంటి?

50 శాతం లెక్కించడానికి అభ్యంతరమేంటి?

దేశంలో అసలు ఎన్నికల సంఘం ఉందా?
వీవీప్యాట్‌లపై ఈసీని నిలదీసిన చంద్రబాబు

అమరావతి: ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని చెబుతుంటే మీకున్న అభ్యంతరమేంటని ఈసీని చంద్రబాబు నిలదీశారు. ఈవీఎంలలో నమోదువుతున్న ఓట్లకు వీవీప్యాట్‌కు స్లిప్పులకు తేడా ఉంటున్నందునే లెక్కించాలని చెబుతున్నామన్నారు. 50 శాతం స్లిప్పులు లెక్కించడానికి మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని ఈసీని ప్రశ్నించారు. ఈ మేరకు అమరావతిలో మీడియాతో ఆయన  మాట్లాడారు. వీవీ ప్యాట్లపై ఇక్కడితో ఆగేది లేదని.. ఇతర రాష్ట్రాలకూ వెళ్లి అందరినీ చైతన్య పరుస్తామని చెప్పారు. దీనిపై మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు చంద్రబాబు వివరించారు.

తప్పుడు అఫిడవిట్‌ ఇస్తారా?
‘‘50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించడానికి ఎన్నికల సంఘానికి అభ్యంతరమేంటి?ఆరు రోజులు పడుతుందని సుప్రీం కోర్టులో తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈవీఎం, వీవీప్యాట్‌ స్లిప్పులకు తేడా ఉంటున్నందునే లెక్కించాలని కోరుతున్నాం. దీనిపై మళ్లీ సుప్రీంకోర్టుకు వెళతాం. సాక్షాత్తు ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది వెళితేనే ఓటు వేయడం కుదరలేదు. తరువాతి రోజు ఉదయం 4 గంటల వరకు ప్రజలు ఓటు వేశారు. ఇంత అవకతవకల ఎన్నికలను నేను ఎప్పుడూ చూడలేదు. అసలు దేశంలో ఎన్నికల సంఘం ఉందా? తప్పులను ఎత్తి చూపితే రాజకీయం చేస్తున్నారు. సందేహాలకు సమాధానం చెప్పడం మానేసి ఎదురుదాడి చేస్తున్నారు’’ అని చంద్రబాబు అన్నారు.

ఈసీకున్న అవగాహన ఎంత?
‘‘190కి పైగా దేశాల్లో 18 దేశాలు మాత్రమే ఈవీఎంలు వాడుతున్నాయి. సాంకేతికతను అంతంత మాత్రంగా వినియోగించే వెనుకబడిన దేశాలు మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నాయి. ఎన్నికల కమిషన్‌కు సాంకేతికతపై ఉన్న అవగాహన ఎంత? ఏ ప్రాతిపదికన ఈసీ వాదిస్తోంది. టెక్నాలజీని మొదటి నుంచి ప్రమోట్‌ చేస్తూ వచ్చా. నా కన్నా ప్రపంచంలో ట్రెండ్స్‌ ఏంటో బాగా వీళ్లకు తెలుసా? దేశంలో ఎవరికీ అర్థం కాని రోజుల్లోనే ఈ-సేవ లాంటివి ప్రవేశపెట్టా. తెలంగాణలో 25 లక్షల ఓట్లు తీసేశారు. దిల్లీలో 30 లక్షలు తొలగించారు. ఏపీలోనూ ఫారం-7తో ఓట్లు తీసేయాలని కుట్రలు చేశారు. అప్రమత్తమవ్వడంతో అది సాధ్యం కాలేదు. ఫారం-7 విషయంలో ఫిర్యాదులు చేస్తే పట్టించుకోలేదు. ఐపీ అడ్రస్‌లు అడిగితే సమాధానం లేదు’’ అని చంద్రబాబు విమర్శించారు. 

కేంద్రానివన్నీ తప్పులే..
‘‘సుప్రీం కోర్టులో రఫేల్‌ ఒప్పందంపై కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. పీఏసీ చూసిందని చెప్పింది. తీరా నిలదీస్తే అచ్చు తప్పని మరో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఎయిర్‌స్ట్రైక్స్‌ విషయంలోనూ కేంద్రం అబద్ధాలు చెప్పింది. 300 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చామని చెబుతున్నారు. ఎవరైనా వచ్చి చూసుకోవాలని పాక్‌ ప్రధాని చెబితే ఆ ఆరోపణలను ప్రతిపక్షాలపై నెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే ప్రధాని మీపై పొగడ్తలు కురిపిస్తున్నారు. అది మీ బంధానికి నిదర్శనం. దీనిపై మోదీ సమాధానం చెప్పాలి. గతంలో ‘డెమోక్రటిక్‌ ఎట్‌ రిస్క్‌’ పేరిట జీవీఎల్‌ ఈవీఎంల లోపాలపై ఏకంగా పుస్తకం రాశారు. అదే వ్యక్తి ఇప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈవీఎంలపై కేసు వేసిన సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు ఎక్కడా దీనిపై మాట్లాడడం లేదు’’ అని చంద్రబాబు విమర్శించారు.