Home జాతీయం రాహుల్‌ను అధికారంలోకి రానివ్వం:ఉద్దవ్‌ ఠాక్రే

రాహుల్‌ను అధికారంలోకి రానివ్వం:ఉద్దవ్‌ ఠాక్రే

నాగ్‌పూర్‌: ఎన్నికల వేళ ఎన్డీయే భాగస్వామ్య పక్షం శివసేన అధినేత ఉద్దవ్‌ ఠాక్రే కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. రాజద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామన్న కాంగ్రెస్‌ హామీని ఆయన తప్పుబట్టారు. దేశద్రోహులకు మద్దతునిస్తున్న రాహుల్‌ను అధికారంలోని రానిచ్చేది లేదని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ఆదివారం జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజయోజనాల దృష్ట్యా భాజపా, శివసేన, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఏకతాటిపైకి వచ్చాయన్నారు. మరి ప్రతిపక్షాలు ఎందుకు కలిసి పోటీ చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఒకప్పుడు తీవ్ర విభేదాలున్న పార్టీలు సైతం అధికార దాహంతో ఏకమయ్యాయని ఆరోపించారు. ఎన్డీయే కూటమి తరఫున నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించామని.. మరి ప్రతిపక్షాల అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు.

కాంగ్రెస్‌ రాజద్రోహ చట్టాన్ని రద్దు చేస్తాననడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఉద్దవ్‌ ఠాక్రే.. దేశ ద్రోహులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ద్రోహుల మద్దతుతో అధికారంలోకి రావాలని రాహుల్‌ భావిస్తే.. భాజపా-శివసేన కూటమి అలా జరగనివ్వదని హెచ్చరించారు. 48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్రలో 23 సీట్లలో శివసేన పోటీ చేస్తుండగా.. 25 స్థానాల్లో భాజపా బరిలోకి దిగనుంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.