Home Uncategorized ‘అక్కడ ఎన్నికల రద్దుకు ఆదేశించలేదు’

‘అక్కడ ఎన్నికల రద్దుకు ఆదేశించలేదు’

వెల్లూరు: తమిళనాడులోని వెల్లూరులో భారీగా నగదు పట్టుబడడంతో అక్కడ ఎన్నికలు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలిపింది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈసీ, ఐటీ తనిఖీల్లో స్థానిక డీఎంకే పార్టీ కార్యాలయంలో భారీగా నగదు పట్టుబడ్డట్లు సమాచారం. దాదాపు రూ.11కోట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

దీంతో ఎన్నికలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని భావించిన ఈసీ వెల్లూరు లోక్‌సభ ఎన్నికల రద్దుకు సిఫార్సు చేస్తూ దిల్లీలోని అధికారులకు లేఖ రాసినట్లు సోమవారం వార్తలు వచ్చాయి. అలాగే స్థానిక అభ్యర్ధి ఆనంద్‌ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చిన నేరం కింద కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల రద్దుపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. 2016లోనూ భారీగా నగదు పట్టుబడడంతో రాష్ట్రంలోని కొన్ని స్థానాల్లో ఎన్నికలు రద్దు చేసిన విషయం తెలిసిందే.