Home అంతర్జాతీయం అగ్రరాజ్యానికి పక్కలో బల్లెం

అగ్రరాజ్యానికి పక్కలో బల్లెం

‘మనకు తెలుస్తోందో లేదో కాని, ఇప్పుడు మనమో సమస్యలో చిక్కుకుంటున్నాం. ఒక్కసారి వాళ్లు వెనుజువెలాలో పాదం మోపారంటే క్రమంగా మన దగ్గరికే వస్తారు. మన దక్షిణ భూభాగం వారి లక్ష్యం పరిధిలోకి వస్తుంది. సరైన ఆయుధాలు ఉంటే తేలిగ్గా ఫ్లోరిడా లేదా ఇతర కీలక భూభాగాలపై దాడి చేయవచ్చు’… ఈ మాటలు అన్నది ఎవరో కాదు- అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ రిక్‌ స్కాట్‌. ఏదైనా తెగేదాకా లాగే వైఖరి ఉన్న అధ్యక్షుడు ట్రంప్‌ వైఖరిని ఈ వ్యాఖ్యలు పరోక్షంగా తప్పుపడుతున్నాయి. రిక్‌ స్కాట్‌ మాటల్లో నిజం లేకపోలేదు. మార్చి 25న రష్యాకు చెందిన యాంటనోవ్‌-124 రవాణా విమానం, మరో చిన్న జెట్‌ విమానంతో కారకస్‌ సమీపంలోని విమానాశ్రయంలో వాలాయి. దాదాపు వందమంది రష్యా సైనికులు 35 టన్నుల సామగ్రితో అక్కడకు చేరుకొన్నారు. వీరంతా సిరియా యుద్ధభూమిలో బాగా అనుభవం గడించినవారు. ఈ ఘటనతో వెనుజువెలా సంక్షోభం మరో ఘట్టానికి చేరింది. ఇవాళో రేపో వెనుజువెలాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ బాధ్యతను భుజాన వేసుకొని సైనిక జోక్యంతో తన కీలుబొమ్మ జుయాన్‌ గుయడోకు అధికార పగ్గాలు అప్పజెప్పాలని కలలుగన్న అమెరికాకు ఇది చేదువార్తగా మారింది. ఇప్పటికే సిరియాలో బషర్‌ అల్‌ అసద్‌ పాలనకు చరమగీతం పాడాలని విశ్వప్రయత్నం చేసిన అమెరికా వట్టిచేతులతో వెనుదిరింది. అక్కడ అసద్‌కు రష్యా అండగా ఉండటంతో అమెరికా అడుగైనా ముందుకు వేయలేకపోయింది.

సిరియాలో పరిస్థితిని వెనుజువెలా సంక్షోభంతో పోల్చలేం. ఇక్కడ రష్యా జోక్యానికి అనేక భౌగోళిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. ఇప్పటికే రష్యా సరిహద్దుల్లోని చాలా దేశాలు నాటోలో చేరాయి. ఇది రష్యాకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనికితోడు ఉక్రెయిన్‌ విషయంలో అమెరికా తరచూ తలదూరుస్తోంది. ఎదురుదాడే అన్నింటికన్నా అతిగొప్ప ఆత్మరక్షణ వ్యూహం అన్నది కేజీబీలో పనిచేసిన పుతిన్‌కు వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఆయుధాలతో సహా ఏకంగా అమెరికా ముంగిట కూర్చున్నాడు. ఈ చర్యతో దక్షిణ అమెరికా పూర్తిగా యుద్ధక్షేత్రంగా మారే ప్రమాదముంది. అమెరికా చర్యలు ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు, ఒప్పందాలకు వ్యతిరేకంగా ఉన్నాయని రష్యా బహిరంగంగానే ప్రకటించింది. ఇక ఆర్థిక కోణంలో చాలా కారణాలు కనిపిస్తాయి. చమురు నిల్వల పరంగా సౌదీ అరేబియాను మించిన దేశం వెనుజువెలా. కానీ, ప్రపంచ రాజకీయాల కారణంగా ఇక్కడ పేదరికం తాండవిస్తోంది. ఇక్కడ చమురు నిల్వలపై ఆధిపత్యం కోసం ప్రపంచ దేశాలు పరోక్ష యుద్ధానికి దిగాయి. దీనిలో రష్యా కూడా భాగమైంది. ఇప్పటికే రష్యా దాదాపు 1,700 కోట్ల డాలర్ల వరకు ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్లు అంచనా. చమురు దిగ్గజం పీడీవీఎస్‌ఏతో కలిసి రష్యాకు చెందిన రూసోనెఫ్ట్‌ చాలా ప్రాజెక్టుల్లో వెనెజువెలా ప్రభుత్వానికి భాగస్వామిగా మారింది. ఛావెజ్‌ తరవాత అధికార పగ్గాలు చేపట్టిన నికోలస్‌ మడురో రష్యా అనుకూల వైఖరితో ఉన్నారు. ఇప్పటికే ఆంక్షల పేరుతో వెనుజువెలాకు చెందిన దాదాపు 700 కోట్ల డాలర్ల ఆస్తులను అమెరికా స్తంభింపజేసింది. ఇప్పుడు ‘అంకుల్‌ శామ్‌’కు అనుకూలంగా ఉన్న జుయన్‌ గుయాడో అధికారంలోకి వస్తే రూసోనెఫ్ట్‌ ప్రాజెక్టులను రద్దు చేస్తారనే అనుమానం రష్యాను పీడిస్తోంది. దీంతో ఇక్కడ అధికార మార్పిడి జరగకుండా ప్రత్యక్షంగా తలపడేందుకూ సిద్ధమైంది.

వెనుజువెలాలో అగ్రరాజ్యాల ఆధిపత్యపోరు ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలకూ ప్రమాదకరంగా మారింది. వెనుజువెలా నుంచి  జులై 27 తరవాత చమురు కొనుగోళ్లు నిలిపేయాలని అమెరికా తన దేశంలోని కంపెనీలను ఆదేశించింది. భారత్‌కు అత్యధికంగా చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో వెనుజువెలా ఆరో స్థానంలో ఉంది. అమెరికాకు చమురు ఎగుమతులు తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ విపణుల కోసం ఆ దేశం ఎదురు చూస్తోంది. వెనుజువెలా రకం చిక్కటి ముడిచమురును శుద్ధిచేసే కర్మాగారాలు భారత్‌, చైనాల్లో మాత్రమే అధికంగా ఉన్నాయి. ఇప్పటికే ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన పెట్రోటెక్‌ సమావేశానికి హాజరైన వెనుజువెలా చమురుశాఖ మంత్రి మాన్యూల్‌ క్యూవోడో భారత్‌కు చమురు ఉత్పత్తిని  రెండింతలు చేయడానికి సిద్ధమని ప్రకటించారు. దీనికి తోడు వస్తుమార్పిడి పద్ధతిలో చమురు విక్రయానికి వెనుజువెలా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. వెనుజువెలా నుంచి మనదేశం 587 కోట్ల డాలర్ల చమురు, విద్యుత్‌ కేబుల్స్‌, ఇనపగుండ్లను దిగుమతి చేసుకొంది. దాదాపు 7.93 కోట్ల డాలర్ల విలువైన వస్తుసేవలను ఎగుమతి చేస్తోంది. వస్తుమార్పిడి పద్ధతితో బియ్యం, దుస్తులు, ఔషధాలు వంటివీ ఎగుమతి చేసి వాణిజ్యలోటును భర్తీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడో సమస్య ఉంది. దిగుమతులు పెంచినా ఆ మేరకు చమురును శుద్ధిచేసే సామర్థ్యం ఉన్న ప్లాంట్లు లేవు. దేశంలోని ప్రభుత్వరంగంలోని ఐఓసీ, బీపీసీఎల్‌ చమురు సంస్థలు ఈ రకం చమురును శుద్ధి చేయలేవు. కేవలం రిలయన్స్‌, నయరా ఎనర్జీ మాత్రమే ఈ రకం చమురును శుద్ధిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వీటిల్లో నయారా ఎనర్జీలో రష్యాకు చెందిన రూసోనెఫ్ట్‌కు 49శాతం వాటాలు ఉన్నాయి. రష్యాను కట్టడి చేసే ఉద్దేశంతో అమెరికా జులై 28 నుంచి వెనుజువెలాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైతే వెనుజువెలాను కాట్సా చట్టం పరిధిలో చేర్చలేదు. కానీ, ఆ దేశానికి జీవరేఖ అయిన పెట్రో కంపెనీ పీడీవీఎస్‌ఏను బిగించేలా ఈ ఆంక్షలను అమలుచేసే అవకాశం ఉంది.

అమెరికాకు వ్యతిరేకంగా వెళ్లైనా తన ఆర్థిక ప్రయోజనాలను సిద్ధింపజేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తుంది. భారత్‌ పరిస్థితి అలా కాదు. భౌగోళిక రాజకీయాలను సమతుల్యం చేసుకొంటూ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను తగ్గించుకొన్న భారత్‌కు వెనుజువెలా పరిణామాలతో తీవ్ర ఇబ్బంది పడనుంది. వెనుజువెలాలో యుద్ధవాతావరణం నెలకొంటే భారత్‌లోని రిఫైనరీలు మరో మార్గాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అప్పుడు అధికమొత్తంలో చెల్లింపులు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కలిసి భారత వాణిజ్యలోటును పెంచే ప్రమాదం ఉంది.– పెద్దింటి ఫణికిరణ్‌