Home Uncategorized అసత్యాలు ప్రచారం చేయొద్దు: రజత్‌

అసత్యాలు ప్రచారం చేయొద్దు: రజత్‌

హైదరాబాద్‌: ప్రజాస్వామిక స్ఫూర్తికి విఘాతం కలిగేలా కొందరు సామాజిక మాధ్యమాల్లో ఈసీపై దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ మండిపడ్డారు. పోలింగ్‌ శాతాలతో పాటు పలుచోట్ల ఈవీఎంల తరలింపు తదితర అంశాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నట్టు స్పష్టంచేశారు. పోలింగ్‌ పూర్తయిన వెంటనే సాయంత్రం 5గంటలకు అంచనా వివరాలు ఇస్తామని.. తర్వాతి రోజు మాత్రమే పోలింగ్‌ శాతాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వగలమని పేర్కొన్నారు. పోలింగ్‌ ముగిసే ముందు ఫారం 17సీ కాపీలు పోలింగ్‌ ఏజెంట్లకు అందిస్తామని.. దానిపై వాళ్ల సంతకాలు సైతం ఉంటాయన్నారు. ఫారం 17ఏ, ఫారం 17సీని సరిచూసుకున్న తర్వాత కూడా అనవసర రాద్ధాంతం చేయడం తగదని మండిపడ్డారు. జగిత్యాలలో ఆటోలో తరలించిన ఈవీఎంలు శిక్షణ కోసం వినియోగించినవేనని రజత్‌కుమార్‌ స్పష్టంచేశారు.  ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.  కల్పిత కథనాల వల్ల ప్రతిఒక్కరికీ అనుమానాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌లో ఫొటోలు తీసుకున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఆ వ్యక్తిపై న్యాయ విచారణ జరుగుతోందన్నారు.