Home Uncategorized అసోంలో తెలుగు చైతన్య కీర్తి

అసోంలో తెలుగు చైతన్య కీర్తి

సోంలోని కరీమ్‌గంజ్‌ లోక్‌సభ స్థానం ఈనెల 18వ తేదీన ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ నియోజకవర్గంలోని హైలకండీ గువాహటికి 310 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి అధికారులు ప్రత్యేకంగా మహిళా ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఈ ప్రాంతంలో ముస్లింలు, వలస వచ్చిన బెంగాలీలూ ఎక్కువ. సంప్రదాయాల పేరుతో మహిళలు బయటకురారు. దాంతో హైలకండీలో మహిళల పోలింగ్‌ శాతం తక్కువ నమోదవుతున్నట్టు ఆ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ జల్లి కీర్తి గుర్తించారు. 2013లో సివిల్స్‌కు ఎంపికైన తెలుగమ్మాయి కీర్తి అక్కడ తొలి మహిళా డిప్యూటీ కమిషనర్‌. ఆమె మహిళల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. వారికి అవగాహన వస్తే కుటుంబమంతా వచ్చినట్టే అన్నది కీర్తి ఉద్దేశం. 18 నుంచి 40ఏళ్ల లోపు మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్లు అందిస్తూ వాటి వాడకం, అవశ్యకతను కీర్తి వివరిస్తున్నారు. ఆ ప్యాక్‌ల మీద పోలింగ్‌ తేదీ వేసి తప్పకుండా ఓటు వేయాలని చెబుతున్నారు. వివాహితులైన బెంగాలీలు ముత్యపు చిప్ప,   పగడంతో చేసిన     వెడల్పాటి గాజును ధరిస్తారు. దాన్ని షఖా అంటారు. కీర్తి ఈ షఖాలను ప్రత్యేకంగా తయారు చేయించి వాటిపైన స్థానిక భాషలో ఓటు సందేశాలు రాసి, తారీఖు వేసి అందిస్తున్నారు. ఎండ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఎన్నికల కమిషన్‌ ముద్ర ఉన్న శీతల చాపలు(వట్టివేళ్ల చాప వంటివి), టీ తోటల్లో పని చేసేవారికి వెదురు టోపీలు అందిస్తున్నారు. వీటిని చూసినప్పుడైనా వారికి ఓటు వేయాలనే  ఆలోచన రావాలి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా’ అంటున్నారు కీర్తి.