Home Uncategorized కర్ణాటకలో ఐటీ సోదాలు

కర్ణాటకలో ఐటీ సోదాలు

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటకలో ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. బెంగళూరు, హసన్‌, మండ్య ప్రాంతాల్లోని దాదాపు 12 చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ సోదాలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

రియల్‌ఎస్టేట్‌, క్వారీలు, ప్రభుత్వ కాంట్రాక్టులు, పెట్రోల్‌ బంక్‌లు నిర్వహించేవారు, కోఆపరేటివ్‌ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్లు తదితరుల నివాసాలు, కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. వీరి వద్ద అప్రకటిత ఆస్తులు ఉన్నాయని, వాటికి పన్ను చెల్లించట్లేదని తమకు ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు జరుపుతున్నట్లు తెలిపారు. హసన్‌లోని ఐదు, బెంగళూరులో ఒక ఇల్లు, మండ్యలోని పలు ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. 

కర్ణాటకలో ఏప్రిల్‌ 18న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. నేటితో ప్రచారానికి తెరపడనుంది. కాగా.. ఇటీవల కూడా రాష్ట్రంలో ఐటీ సోదాలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. జేడీఎస్‌ నేతల ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. వీటి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.