Home జాతీయం గోరఖ్‌పూర్‌ బరిలో రేసు గుర్రం నటుడు

గోరఖ్‌పూర్‌ బరిలో రేసు గుర్రం నటుడు

దిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో భాజపా కంచుకోట అయిన గోరఖ్‌పూర్‌ నుంచి ప్రముఖ నటుడు రవి కిషన్‌ను బరిలోకి దించింది కమలం పార్టీ. యూపీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే మరో ఏడుగురు అభ్యర్థుల జాబితాను భాజపా సోమవారం విడుదల చేసింది. ఇందులో గోరఖ్‌పూర్‌ స్థానానికి రవి కిషన్‌ పేరుకు ప్రకటించింది. 

ఇక ఇటీవలే భాజపాలో చేరిన గోరఖ్‌పూర్‌ సిట్టింగ్‌ ఎంపీ ప్రవీణ్‌ కుమార్‌ నిషాద్‌ను సంత్‌ కబీర్‌ నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీకి దింపారు. గోరఖ్‌పూర్‌ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాథ్‌ యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే గతేడాది జరిగిన ఉప ఎన్నికల్లో భాజపాకు షాక్‌ తగిలింది. ఎస్పీ, బీఎస్పీ మద్దతుతో నిషాద్‌ పార్టీకి చెందిన ప్రవీణ్‌ కుమార్‌ నిషాద్‌ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 

తాజా ఎన్నికల్లో నిషాద్‌ పార్టీ తొలుత ఎస్పీ-బీఎస్పీ కూటమితో చేతులు కలిపింది. అయితే సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ కూటమి నుంచి వైదొలిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రవీణ్ కుమార్‌ భాజపాల కూటమిలో చేరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గోరఖ్‌పూర్‌ నుంచి కమలం పార్టీ మళ్లీ ప్రవీణ్‌నే బరిలోకి దింపుతుందని అంతా భావించారు. అయితే ఊహించని విధంగా ఆ స్థానంలో రవి కిషన్‌ పేరు ప్రకటించింది. 

భోజ్‌పురిలో ప్రముఖ నటుడైన రవి కిషన్‌ పలు సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. ఇటీవలే భాజపాలో చేరిన ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచతమే. అల్లు అర్జున్‌ నటించిన రేసు గుర్రం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రవికిషన్‌ ఆ తర్వాత కిక్‌ 2, సుప్రీం, ఒక అమ్మాయి తప్ప, రాధ, లై, ఎమ్మెల్యే, సాక్ష్యం, ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రాల్లో నటించారు.