Home Uncategorized రక్త పరీక్షకు ఒక్క నమూనా సరిపోదా!

రక్త పరీక్షకు ఒక్క నమూనా సరిపోదా!

ఆంధ్రప్రదేశ్‌లో సమస్య వచ్చింది 45 ఈవీఎంలలోనే
ఈవీఎంలు సరిగా పనిచేయకపోవచ్చు..  ట్యాంపరింగ్‌ సాధ్యంకాదు
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా
ఈనాడు – దిల్లీ

ఎన్నికల ఫలితాల్లో పారదర్శకత కోసం 50% వీవీప్యాట్‌లు లెక్కించాలన్న ప్రతిపక్షాల వాదనను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా తోసిపుచ్చారు. ‘రోగ నిర్ధరణకు రక్త పరీక్షలు చేయాల్సి వచ్చినప్పుడు రక్త నమూనాలు ఒక చోట తీసుకుంటామా లేదంటే 20 చోట్ల నుంచి సేకరిస్తామా’ అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 45 ఈవీఎంల్లోనే సమస్య వచ్చినట్లు తెలిపారు. తొలి దశ ఎన్నికల నిర్వహణ తీరుపై సోమవారం ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వీవీప్యాట్‌ల అంశంపై మేం సమర్పించిన ప్రమాణపత్రం ఆధారంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అయిదు వీవీప్యాట్‌లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అప్పటికప్పుడు నిర్ణయించుకొని(ర్యాండం) ఎంపిక చేసి లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ ఆదేశాలను అమలుచేయాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు ఆదేశాలు జారీచేశాం. దీనిపై రాజకీయ పార్టీలు మళ్లీ కోర్టుకు వెళ్లాలనుకుంటున్నట్లు మీడియాలో చూశాను. ఒకవేళ కోర్టు అడిగితే మా అభిప్రాయాలను మళ్లీ చెబుతాం. ఈవీఎంలను రెండు దశాబ్దాల నుంచి దేశంలో ఉపయోగిస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీవీప్యాట్‌ల ఏర్పాటు జరిగింది. ఉదాహరణకు ఒక వ్యక్తికి రక్త పరీక్షలు చేయాలంటే నమూనాలను ఒకచోట నుంచి తీసుకుంటారా? శరీరంలోని 20 చోట్ల నుంచి తీసుకుంటారా? ఈవీఎంలపై విమర్శలు ఆవేదనకరం’’ అని అరోడా అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒక పార్టీ గెలిస్తే, 2015లో జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరో పార్టీ గెలిచిన విషయాన్ని అరోడా గుర్తు చేస్తూ ఇప్పటివరకూ ఈసీఐ 1500 వీవీప్యాట్‌లు లెక్కిస్తే అవన్నీ ఈవీఎంలతో సరిపోలాయని తెలిపారు.

ప్రతి ఈవీఎం ప్రత్యేకమే
‘‘ఈవీఎంలు దేనికి అదే ప్రత్యేకం, ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండవు కాబట్టి వాటిని ట్యాంపర్‌ చేయలేరు. అవి సరిగా పనిచేయకపోవచ్చు తప్పితే ట్యాంపర్‌కు వీలుకాదు. ఆంధ్రప్రదేశ్‌లో ఈవీఎంల వైఫల్యంపై మేం పూర్తిస్థాయి వివరాలు సేకరించి చార్ట్‌ తయారుచేశాం. 11వ తేదీ ఉదయం 10 గంటలకు నాకు ఫోన్‌ వచ్చినప్పుడు 35% ఈవీఎంలు పనిచేయడంలేదని చెప్పారు. 11.30 గంటలకు నివేదిక అడిగితే 45 మాత్రమే పనిచేయలేదని చెప్పారు. ఆ సంఖ్యలో కొంత తేడా ఉండొచ్చు. కానీ తీవ్ర ఆందోళనకర పరిస్థితి మాత్రం లేదు. 45వేల ఈవీఎంల్లో 45 మాత్రమే సరిగా పనిచేయలేదు. ఆ ఎన్నిక కోసం మేం 90వేల ఈవీఎంలు తరలించాం. గత ఏడాది జరిగిన అయిదురాష్ట్రాల ఎన్నికల్లో 1.75 లక్షల ఈవీఎంలు ఉపయోగించినప్పుడు కేవలం ఆరు ఈవీఎంల విషయంలో ప్రసారమాధ్యమాలు విస్తృత ప్రచారం కల్పించాయి. ఆ ఆరు కేసుల్లో బాధ్యులైన వారిని సస్పెండ్‌ చేశాం’’ అని అరోడా వెల్లడించారు.

అభ్యర్థి కోరితే మరిన్ని వీవీప్యాట్‌లూ లెక్కిస్తారు

సుప్రీంకోర్టు సూచించిన విధంగా ఒక్కో నియోజకవర్గానికి ఎంపికచేసే అయిదు వీవీప్యాట్‌లే కాకుండా తమకు అనుమానం ఉన్న పోలింగ్‌బూత్‌కు సంబంధించిన వీవీప్యాట్‌నూ లెక్కించాలని పోటీలో ఉన్న అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చని అరోడా వెల్లడించారు. ఆ దరఖాస్తుపై రిటర్నింగ్‌ అధికారి అనుమతిస్తూనో, తిరస్కరిస్తూనో మౌఖిక ఆదేశాలు జారీచేయొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇప్పటికే రూ.2600 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇది అత్యంత   దురదృష్టకరం. దీనిపై రాజకీయపార్టీలన్నీ పూర్తిగా ఆలోచించుకోవాలని  అరోడా సూచించారు.