Home క్రైమ్ న్యూస్ మా నాన్నను వదలొద్దు!

మా నాన్నను వదలొద్దు!

తండ్రి ఘాతుకానికి వణికిన బాలిక
తమ్ముడు, చెల్లెలి హత్యతో ఆందోళన

పటాన్‌చెరు అర్బన్‌, పటాన్‌చెరు: ‘తమ్ముడ్ని చాకుతో గొంతుపై కోశాడు. చెల్లిని తీసుకెళ్లి వంట గదిలో ఉరిపోశాడు. నన్ను కూడా చంపేద్దామని చాకుతో కోయబోయాడు. అలికిడి అవ్వగానే మేల్కొని భయంతో ఆయనకు దూరంగా జరిగా. నన్ను చంపొద్దని, నీ కాళ్లు మొక్కుతానంటూ కాళ్లావేళ్లా మొక్కా. అయినా దయతలచకుండా గొంతుపట్టి చాకుతో కోయబోయాడు. అయితే తాగిన మత్తులో ఉండి తూలిపడటంతో నాకు స్వల్పగాయమైనా సరే తప్పించుకుని వచ్చి మా నాయనమ్మ, మేనత్తలకు చెప్పా. ఆయన్ని మాత్రం వదలొద్దు’

-కర్కశుడిగా మారిన తన కన్నతండ్రి చేతుల నుంచి అదృష్టవశాత్తు తప్పించుకుని, ప్రాణాలతో బయటపడిన బాలిక పలికిన మాటలివి.
పాపం… ఆ చిన్నారులు నాన్న ఎత్తుకుంటే వేరోచోట పడుకోబెడుతున్నాడని భావించారు. కన్నతండ్రే కాలయముడుగా మారి ప్రాణాలు హరిస్తాడని తెలియదు. అర్ధరాత్రి నిద్రమత్తులో ఏం చేయాలో తెలియని పరిస్థితి. కనీసం అరిచే సమయం కూడా దక్కని స్థితిలో తమ ఊపిరి వదిలారు. మేల్కొన్న పెద్దపాప భయంగుప్పెట్లో బయటపడి ప్రాణాలు దక్కించుకుంది. పటాన్‌చెరు మండలం చిన్నకంజర్లకు చెందిన శిరీషకు తండ్రి లేకపోవడంతో తన తలి,్ల చెల్లిని పోషించుకునేందుకు రోజుకూలీకి వెళ్లేది. అదేచోట మేస్త్రీగా పనిచేసే రామచంద్రాపురం బొంబాయికాలనీకి చెందిన కుమార్‌తో పరిచయమై ప్రేమగా మారింది. అతనిపై నమ్మకంతో 12ఏళ్ల క్రితం పెళ్లిచేసుకుంది. వివాహమైన తర్వాత అతని నిజస్వరూపం బయటపడింది. తొలినాళ్ల నుంచే అనుమానంతో వేధించి, కొట్టేవాడు. వారికి మల్లేశ్వరి(10), అఖిల్‌(7), శరణ్య(4) పిల్లలు కలిగారు. క్రమంగా మద్యానికి బానిసగా మారి.. పిల్లలు తనకు పుట్టలేదని, అందర్నీ చంపేస్తానని బెదిరింపులకు గురిచేసేవాడని, గతంలో తనపై రెండుసార్లు హత్యాయత్నానికి యత్నించినట్లు శిరీష వాపోయింది. ఎంత చేసినా… పిల్లల కోసం తట్టుకుని అతనితోనే ఉన్నానని, మార్చి 10న ఉదయమే తాగొచ్చి తనతో గొడవపడ్డాడని తెలిపింది. శారీరకంగా హిస్తుండటంతో తట్టుకోలేక సాయంత్రం పిల్లలను తీసుకుని అమ్మగారింటికి వెళ్లిపోతుండగా మార్గమధ్యంలో తనను కొట్టి, పిల్లలను లాక్కుని పోయాడని ఆరోపించింది. చేసేదిలేక పుట్టింటికి వెళ్లిపోయాయనని, కుమార్‌ను ఇష్టపడి తన వాళ్లకు కూడా చెప్పకుండానే పెళ్లి చేసుకున్నానని, అందువల్లే ఇంతకాలం ఎక్కడా పంచాయతీలు కూడా పెట్టలేదని శిరీష చెబుతోంది.

అప్పుడే పోలీసులకు పట్టించి ఉంటే… తాగిన మత్తులో భార్య గుర్తుకు వచ్చినప్పుడల్లా పుట్టింట్లో ఉంటున్న భార్య శిరీషకు కుమార్‌ ఫోన్‌ చేసి మాటలతో హింసించేవాడు. ఈనెల 11న లోక్‌సభ ఎన్నికల రోజున కూడా ఆమెకు ఫోన్‌ చేసి, కోపంతో ఇంటికి వచ్చి నాలుగు ఉరితాళ్లు సిద్ధం చేశాడు. ముగ్గురు పిల్లలను తాళ్లకు వేలాడదీశాడు. భయంతో పిల్లలు బిగ్గరగా ఏడుస్తూ కేకలు వేశారు. చుట్టుపక్కల పరుగున వచ్చి కాపాడారు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పిల్లలు తండ్రి లేని వారవుతారని భావించారు. అప్పుడే ఠాణాకు పంపిస్తే కుమార్‌ ఇప్పుడు ఇంతటి ఘాతుకానికి పాల్పడేవాడు కాదు. పిల్లల ప్రాణాలు దక్కేవి. సంఘటన స్థలాన్ని అదనపు డీసీపీ ఇందిర, ఏసీపీ రవికుమార్‌, సీఐ రామచంద్రారావు పరిశీలించి, వివరాలను సేకరించారు.