Home జాతీయం వారణాసి.. ప్రియాంక.. ఓ సస్పెన్స్‌

వారణాసి.. ప్రియాంక.. ఓ సస్పెన్స్‌

ఇప్పుడే చెప్పనంటున్న రాహుల్‌

లఖ్‌నవూ: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(యూపీ తూర్పు విభాగం)గా బాధ్యతలు చేపట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ప్రియాంక గాంధీ వాద్రా. ఆమె రాక సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్‌ నేతలు విశ్వాసంగా ఉన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో ఆమె ప్రధాని మోదీపై వారణాసి నుంచి పోటీ చేస్తారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై స్పష్టత మాత్రం రావట్లేదు. అయితే ఈ విషయాన్ని ఇప్పుడప్పుడే చెప్పనంటూ సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. 

రాహుల్‌ గాంధీ ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంగా వారణాసి నుంచి ప్రియాంక గాంధీని పోటీకి నిలబెడతారా అంటూ మీడియా ప్రతినిధి రాహుల్‌ను ప్రశ్నించారు. ఇందుకు ఆయన స్పందిస్తూ.. ‘ఈ విషయంలో మిమ్మల్ని సస్పెన్స్‌లోనే ఉంచుతాను. సస్పెన్స్‌ అనేది ఎప్పుడూ చెడ్డ విషయం కాదు’ అని చెప్పారు. అంటే ఈ వార్తలను మీరు తోసిపుచ్చడం లేదు కదా అని మీడియా ప్రతినిధి మళ్లీ అడగగా.. ‘నేను ఏ వార్తలను ధ్రువీకరించడం లేదు.. తోసిపుచ్చడం లేదు’ అని  అన్నారు. 

 తన తల్లి సోనియా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని గత నెల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రియాంకగాంధీని కోరారు. దానికి ఆమె స్పందిస్తూ.. ‘నేను పోటీ చేసే స్థానం వారణాసి’ ఎందుకు కాకూడదు అని తిరిగి ప్రశ్నించారు. ఆ మరుసటి రోజే పార్టీ కోరుకుంటే తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. దీంతో ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తాయి. 

ఇటీవల ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రా కూడా ఆమె వారణాసి నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు. మరోవైపు వారణాసిలో కాంగ్రెస్‌ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ప్రియాంక గాంధీ పోటీపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ వారణాసి నుంచి ప్రియాంక గనుక బరిలోకి దిగితే దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ఎన్నిక ఇదే అవుతుంది.