Home Uncategorized స్టార్‌డమ్‌ని నమ్ముతా కానీ… దానికి అర్థం అది కాదు

స్టార్‌డమ్‌ని నమ్ముతా కానీ… దానికి అర్థం అది కాదు

‘‘ఇంట్లో నాకు నవీన్‌ అని పేరు పెట్టారు. మా అమ్మ ముద్దుగా నాని అని పిలుచుకుంది. ప్రేక్షకులు నాకు ఇష్టంతో పెట్టిన పేరు… నేచురల్‌ స్టార్‌. మొదట్లో ఎందుకు అనుకొనేవాణ్ని కానీ… వాళ్లు ప్రేమతో అలా పిలుస్తున్నప్పుడు ఎంతో  సంతృప్తిగా ఉంటుంద’’న్నారు నాని. సహజమైన నటనతో పాత్రల్లో  ఒదిగిపోతున్న కథానాయకుడాయన. ఇటీవల క్రికెట్‌ నేపథ్యంలో ‘జెర్సీ’ చేశారు. ఆ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల 
ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నాని బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ…

ఇది మాజీ క్రికెటర్‌ రమణ్‌ లాంబా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమని అంటున్నారు. నిజమేనా? 
ప్రచార చిత్రాలు చూసి ఇది రమణ్‌ లాంబా కథ అనుకొంటున్నారేమో. ఆయన కూడా క్రికెట్‌ నుంచి బయటికి వెళ్లి, మళ్లీ తిరిగొచ్చారేమో నాకు తెలియదు. కానీ ఈ కథ కల్పితం. క్రికెటర్‌ కథ కాబట్టే సినిమాకి ‘జెర్సీ’ అనే పేరు పెట్టలేదు. ఆ పేరు పెట్టడానికి బలమైన కారణముంది. కథ వినేటప్పుడు చివరి సన్నివేశంలోని సంభాషణలు చెప్పడం పూర్తయిన వెంటనే ఈ సినిమా చేయాలని నిర్ణయం తీసేసుకొన్నా.

చిన్నప్పుడు క్రికెట్‌ ఆడేవారా మీరు? 
గల్లీ క్రికెట్‌ ఆడేవాణ్ని. ఇంటి పక్కన, ఇంటి కాంపౌండ్‌లోనూ ఆడేవాణ్ని. స్కూల్‌ టీమ్‌లో కూడా ఉండేవాణ్ని కానీ… అందరూ ఔట్‌ అయిపోయాకో లేదంటే, ఎవరికైనా దెబ్బలు తగిలితేనో తప్ప నాకు అవకాశం వచ్చేది కాదు. అలాంటి స్థానం నాది. స్కూల్‌లో నేను బ్యాట్స్‌మ్యానే.

ఈ సినిమా తర్వాత క్రికెట్‌తో మరింత అనుబంధం పెరిగిందా? 
క్రికెట్‌ ఏంటో పూర్తిగా అర్థమైంది. ఇదివరకు బాల్‌ని బ్యాట్‌తో పట్టుకొని కొట్టడమే క్రికెట్‌ అనుకొనేవాణ్ని. సిక్స్‌లు, ఫోర్లు… ఇదే తెలిసేది. కానీ ఈ సినిమా తర్వాత క్రికెటర్‌ బాడీ లాంగ్వేజ్‌ మొదలుకొని… ప్రతి చిన్న విషయం  గురించి తెలిసింది. ఇదివరకు క్రికెట్‌ వస్తుందంటే ఛానల్‌ మార్చేవాణ్ని. కానీ ఈ సినిమా చేశాక క్రికెట్‌ వస్తుందంటే అలా చూస్తూ ఉండిపోతున్నా.

ఈ పాత్ర కోసం శిక్షణ తీసుకొన్నారా? 
హైదరాబాద్‌లో మంచి పేరున్న డానియెల్‌ అకాడమీలో శిక్షణ తీసుకొన్నా. కోచ్‌ డానియెల్‌ మాతోపాటు షూటింగ్‌కి వచ్చి సలహాలు ఇచ్చేవారు.

ఇందులో మీ పాత్రకి మీ అబ్బాయి పేరు… మీ అబ్బాయిగా నటించిన కుర్రాడు నాని అనే పేరుతో కనిపిస్తాడట కదా. అది మీ నిర్ణయమేనా? 
దర్శకుడు కథ చెప్పడానికి వచ్చినప్పుడే… అర్జున్‌, నాని అంటూ మొదలుపెట్టాడు. మధ్యలో ఒకసారి ఆగి… ‘ఇందులో పేర్లు మిమ్మల్ని దృష్టిలో ఉంచుకొనే ఇలా రాసుకొన్నానని అనుకున్నారేమో, కథ రాసుకొనేటప్పుడే నేను అనుకొన్న పేర్లు ఇవి’ అని చెప్పాడు.

సినిమా గురించి చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు… 
ఫలితం విషయంలో కనిపిస్తున్న నమ్మకం కాదిది. నాకు నా బలాలేంటో, బలహీనతలేమిటో తెలుసు. ఒక గొప్ప సినిమా చేశామనే సంతృప్తితో ఉన్నా. అందులో నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసమే ఇది. నేనే కాదు.. చిత్రబృందం అంతా అదే రకమైన అనుభూతికి గురవుతోంది.

ఇలాంటి పాత్రలు నటుల్నే కాకుండా, ప్రేక్షకుల్ని కూడా వెంటాడుతాయని ఇటీవల వేడుకలో చెప్పారు కథానాయకుడు వెంకటేష్‌. అర్జున్‌ పాత్ర మీపై ఎలాంటి ప్రభావం చూపించింది? 
సినిమా ఆఖరి రోజు చాలా భావోద్వేగానికి గురయ్యా. మనసుకు బాగా దగ్గరైన వ్యక్తికి వీడ్కోలు పలికి వస్తున్నట్టు అనిపించింది. నాలోని నటుడిని పిప్పి చేసి, వినియోగించుకొన్న సినిమా ఇది.

క్రీడా నేపథ్యమున్న కథతో ‘భీమిలి కబడ్డీ జట్టు’ చేశారు. ఆ తర్వాత చాలా రోజులకి ‘జెర్సీ’ చేశారు. మధ్యలో ఇలాంటి కథలు రాలేదా? 
వచ్చినా అవి నచ్చాలి కదా. స్పోర్ట్స్‌ జోనర్‌లో కథలు తరచుగా వస్తుంటాయి. కానీ వాటిని మనం ఎంత బాగా తెరపైకి తీసుకొస్తామన్నదే కీలకం. దర్శకుడు గౌతమ్‌కి కథ విషయంలో ఉన్న స్పష్టత, నిజాయతీ చాలా బాగా నచ్చింది. తనతో మాట్లాడుతున్నప్పుడు ఈ వ్యక్తిలో ఇంత లోతుందా అనిపించేది. ఆ లోతు ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. ‘విక్రమ్‌ వేద’లోని ఓ పాటలో శ్రద్ధ శ్రీనాథ్‌ను చూసినప్పుడు… ఈ అమ్మాయి హీరోయిన్‌లా లేదు, సారా పాత్రకైతే చాలా బాగుంటుందని ఆమెని ఎంపిక చేశాం. దర్శకుడి మనసులో ఏముందో అది అర్థం చేసుకొని బాగా నటించింది.

ఈ సినిమా కోసం బరువు తగ్గారా? సెట్‌లో దెబ్బలు తగిలినట్టున్నాయి? 
రిహార్సల్స్‌ చేస్తున్నప్పుడు సహజంగానే బరువు తగ్గిపోయాను. ప్రత్యేకంగా వ్యాయామాలంటూ ఏమీ చేయలేదు. బయటికి వెళ్లినప్పుడు ఈమధ్య లావైనట్టున్నావని ఎవరైనా చెబితే… వారం రోజుల పాటు సీరియస్‌గా జిమ్‌కి వెళతా. ఆ తర్వాత మరిచిపోతుంటా (నవ్వుతూ). ఇక సెట్‌లో  దెబ్బలంటారా? ‘భీమిలి కబడ్డీ జట్టు’ చేస్తున్నప్పుడు కూడా చేతులకీ, కాళ్లకీ గాయాలయ్యేవి. కానీ అప్పట్లో ఇంతగా సామాజిక మాధ్యమాల ప్రభావం ఉండేది కాదు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల వల్ల గాయం తగిలిందనగానే అలా అందరికీ తెలుస్తోంది.

స్టార్‌ అనే మాటపై మీ అభిప్రాయం? 
స్టార్‌డమ్‌ని నమ్ముతా. కానీ దాని గురించి ఇప్పుడు వినిపిస్తున్న అర్థాలపై మాత్రం నమ్మకం లేదు. కంటెంట్‌ వల్లే స్టార్‌డమ్‌ వస్తుందనేది నా అభిప్రాయం.

సినిమా సినిమాకీ అంచనాలు… ఫలితాలు మీపైన ఒత్తిడిని పెంచుతుంటాయా? 
అదంతా నాకు అలవాటైంది. ‘జెండాపై కపిరాజు’, ‘పైసా’, ‘ఆహా కళ్యాణం’… ఇలా వరుసగా పరాజయాలొచ్చాయి. ఆ తర్వాత రెండేళ్లు నా నుంచి సినిమా రాలేదు. కానీ ఏ దశలోనూ ఒత్తిడికి గురికాలేదు. నా దగ్గరికొచ్చిన కథల్ని ఎంపిక చేసుకొని… అలా చేసుకుంటూ వెళ్లిపోతున్నా, అదే నాకు ప్లస్‌ అవుతూ వస్తోంది.

ప్రయోగాల వల్ల ఓవర్సీస్‌ మార్కెట్‌ మనకు అనుకూలంగా మారిందనుకోవచ్చా? 
ఇక్కడైనా, ఓవర్సీస్‌లోనైనా ప్రయోగాలపై స్పందన ఒకలాగే ఉంటుంది. మన సినిమా స్థాయి పెరగడానికి, క్వాలిటీగా కథలు చెప్పడానికి ఓవర్సీస్‌, హిందీ మార్కెట్‌ కారణమవుతోంది.

‘జెర్సీ’ని చైనాలోనూ విడుదల చేస్తారట కదా? 
క్రీడా నేపథ్యం, భావోద్వేగాలకి ప్రాధాన్యమున్న  సినిమాలకి అక్కడ ఆదరణ ఉంది. పైగా ‘జెర్సీ’ ఒక రియలిస్టిక్‌ సినిమా. అది ఏ భాషలో ప్రేక్షకులకైనా కనెక్ట్‌ అవుతుంది. నిజంగా మన కళ్ల ముందు ఒకరి జీవితాన్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. అందుకే చైనాలో విడుదల చేయాలనుకొన్నాం.

వెబ్‌ సిరీస్‌లు చేసే ఆలోచన ఏమైనా ఉందా? 
నేను వెబ్‌ సిరీస్‌లకి అభిమానినే. డిజిటల్‌ మీడియా ఊహించనంత ఎత్తుకు వెళ్లబోతోంది. అది ఎలాంటి మార్పుని తీసుకొస్తుందన్నది తెలియదు కానీ… ప్రస్తుతం అగ్ర నిర్మాణ సంస్థలు చాలా వరకు వెబ్‌ సిరీస్‌ల నిర్మాణంపై దృష్టిపెడుతున్నాయి. సినిమాలతో వచ్చే ఏడాది చివరి వరకు నేను బిజీగా ఉండబోతున్నా. ఆ తర్వాత మంచి కథ దొరికితే వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తానేమో.

ప్రస్తుతం చేస్తున్న ‘గ్యాంగ్‌లీడర్‌’ విశేషాలేంటి? 
‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమాకి నేను పెద్ద అభిమానిని. అయితే మా సినిమా అలాంటిది కాదు. జోనరే వేరు. పేరు విషయంలో అభ్యంతరాలేవీ మా వరకు రాలేదు. అభ్యంతరం చెబుతున్నవాళ్లు మా సినిమా చూశాక… ‘గ్యాంగ్‌లీడర్‌’ పేరు సరైంది కాదంటే తప్పకుండా మారుస్తాం.

దిల్‌రాజుతో చేయబోతున్న మల్టీస్టారర్‌ సంగతులు? 
మరో పది రోజుల్లో ప్రకటిస్తారు.

* ఇదివరకు తొలి రోజు తొలి ఆట చూడటానికి  వెళ్లేటప్పుడు ప్రేక్షకులకు ఆ సినిమా గురించి ఏ విషయం తెలిసేది కాదు. ఒక ప్రత్యేకమైన ఆసక్తి, కిక్‌తో థియేటర్‌కి వెళ్లేవారు. దురదృష్టవశాత్తూ ఆ కిక్‌ ఈతరం మిస్‌ అవుతోంది. మనం ఉదయం 8 గంటల ఆట చూడటానికి వెళ్లేసరికి ఓవర్సీస్‌ నుంచి ప్రీమియర్‌ టాక్‌, అప్‌డేట్స్‌ అంటూ వంద అభిప్రాయాలు వస్తుంటాయి. దీన్ని ఆపలేం కానీ, సినిమా చూడటానికి వెళ్లేవాళ్లు ఫోన్‌ కట్టేసి వెళ్లమని చెబుతాను.

* మన దగ్గర తెరకెక్కే క్రీడా నేపథ్య చిత్రాల్ని ఆట లాగా ఆస్వాదించలేం. ‘లగాన్‌’లాగా ఒక సినిమాని చూస్తున్నా, మ్యాచ్‌ని చూస్తున్న అనుభూతి ఎప్పుడూ కలగదు. అప్పుడప్పుడు మన సినిమాల్లో క్రీడా నేపథ్యం ఉన్నా… హీరో వెళ్లాడు, కొట్టాడు, మ్యాచ్‌ గెలిచాడన్నట్టుగానే ఉంటుంది. ‘జెర్సీ’ అసలు సిసలు క్రీడా నేపథ్యాన్ని చూపిస్తుంది. దీని తర్వాత వరుసగా ఇలాంటి సినిమాలు వస్తాయి.