Home Uncategorized ఆయన్ని సినిమా నుంచి తీసేయడం కుదరదు

ఆయన్ని సినిమా నుంచి తీసేయడం కుదరదు

ముంబయి: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటుడు అలోక్‌నాథ్‌ను సినిమా నుంచి తీసేయడం కుదరదని స్పష్టం చేశారు సినీ నటుడు అజయ్‌ దేవగణ్‌. ఆయన నటించిన ‘దే దే ప్యార్‌ దే’ చిత్రంలో అలోక్‌ కీలక పాత్ర పోషించారు. అయితే అలోక్‌ తనపై అత్యాచారం చేశాడని రచయిత్రి వింటా నందా ఆరోపించిన తర్వాత కూడా ఆయన్ను సినిమాలో తీసుకోవడం ఎంత వరకు సమంజసం? అంటూ పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు అజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అజయ్‌ నిజంగానే ‘మీటూ’కి సపోర్ట్‌ చేసేవారైతే అలోక్‌ నటించిన సన్నివేశాలన్నీ తొలగించి కొత్త నటుడితో రీషూట్‌ చేసేవారని అన్నారు. 
దీనిపై తాజాగా అజయ్‌ ఓ ఆంగ్ల మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘2018 అక్టోబర్‌లోనే ‘దే దే ప్యార్‌దే’ సినిమా విడుదల కావాల్సి ఉంది. చిత్రీకరణ సెప్టెంబర్‌లో పూర్తయింది. అలోక్‌నాథ్‌కు సంబంధించిన సన్నివేశాలను మనాలీలో ఆగస్ట్‌లోనే చిత్రీకరించాం. దాదాపు 40 రోజుల పాటు అలోక్‌తో కలిపి పది మంది ఆర్టిస్ట్‌లతో సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ సమయంలో అలోక్‌పై ఎలాంటి ఆరోపణలు రాలేదు. అతని అసలు స్వరూపం గురించి తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే కేవలం అలోక్‌కు సంబంధించిన సన్నివేశాలైతే అవన్నీ తొలగించి మరో ఆర్టిస్ట్‌ను తీసుకునేవాళ్లం. కానీ అలోక్‌తో పాటు పది మంది ఆర్టిస్ట్‌లు కూడా సినిమాలో భాగస్వామ్యులే. అలాంటప్పుడు మళ్లీ వారందరి డేట్లు మార్చడం, రెట్టింపు పారితోషికం ఇవ్వడం వీలుకాని పని. దీని వల్ల నిర్మాతలకు నష్టం వాటిల్లుతుంది. సినిమా తీయడం అంటే ఎంత పెద్ద బాధ్యతో మనందరికీ తెలిసిందే. అలోక్‌నాథ్‌ను తొలగించాలా? లేదా? అన్నది నేనొక్కడినే తీసుకునే నిర్ణయం కాదు. చిత్రబృందంతో కూడా చర్చించాలి. సినిమాలో ఉన్నవారందరినీ నేనే ఎంపికచేసినట్లుగా కొందరు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడైతే అలోక్‌ను సినిమా నుంచి తొలగించడమైతే కుదరని పని’ అని వెల్లడించారు అజయ్‌.