Home Uncategorized కార్లు కాదు.. ఉగ్రదాడులకు ఇక బైక్‌లు!

కార్లు కాదు.. ఉగ్రదాడులకు ఇక బైక్‌లు!

ఇంటర్నెట్‌డెస్క్‌: పుల్వామా ఉగ్ర దాడి తర్వాత భారత సైన్యంపై మరిన్ని తీవ్రమైన దాడులకు పాకిస్థానీ ఉగ్రసంస్థలు సిద్ధమయ్యాయి. కాకపోతే కార్లకు బదులు ఈసారి బైకులను వాడాలని నిర్ణయించినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ మోటార్‌ సైకిల్‌ బాంబులతో విడతల వారీగా సాయుధ బలగాలపై దాడులు చేయాలని వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. పుల్వామా దాడి తర్వాత కార్లపై నిఘా పెరిగిపోవడంతో ఉగ్ర సంస్థలు ఈ మార్గాన్ని ఎంచుకొన్నాయి.  
ముఖ్యంగా శ్రీనగర్‌, కుప్వారా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవాలని ఉగ్రసంస్థలు ప్రణాళికలు రచించినట్లు సమాచారం. ఇందుకోసం కొందరిని సిద్ధం కూడా చేశాయి. ఈ ఆత్మాహుతి దాడులకు సిద్ధమైన బాంబర్లకు మొఘల్‌ చక్రవర్తుల పేర్లు పెట్టినట్లు నిఘా సంస్థలు పసిగట్టాయి. మోటార్‌ సైకిల్‌కు ఇరువైపులా పేలుడు పదార్థాలను పెట్టుకొని ముందే ఎంచుకున్న లక్ష్యాలపై దాడి చేసేలా ఈ ప్రణాళికలు ఉన్నాయట. కార్లతో పోల్చుకుంటే మోటార్‌ సైకిల్‌ లక్ష్యానికి మరింత సమీపంలోకి వెళ్లే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. 
పుల్వామా దాడి తర్వాత భారత్‌ స్పందించిన తీరుతో ఉగ్ర సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫిబ్రవరి 14 తర్వాత ఉగ్రవాదాన్ని అదుపు చేయాలని పాక్‌పైనా భారీగా ఒత్తిడి పెరిగిపోయింది. దీనికి తోడు ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ కూడా పాక్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చే అంశం ఉధృతంగా తెరపైకి రావడంతో పాక్‌ ఉగ్రమూకలపై ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం ఈ ఉగ్రమూకలు నిద్రాణ స్థితిలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.