Home ఆంధ్ర ప్రదేశ్ అక్కడ వర్తించని ‘కోడ్’‌..ఏపీకెందుకు?

అక్కడ వర్తించని ‘కోడ్’‌..ఏపీకెందుకు?

ఈసీని ప్రశ్నించిన మంత్రి నారా లోకేశ్‌

అమరావతి: ఎన్నికల సంఘం ఆంక్షలన్నీ ఒక్క తెదేపాకే వర్తిస్తాయా అని మంత్రి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి పేరుతో ప్రభుత్వ పరంగా చేసే సమీక్షలపై ఈసీ ఆంక్షలు విధించటంపై ట్విటర్‌లో ఆయన స్పందించారు. ఎన్నికల కోడ్ ఒక్క ఏపీలోనే ఉందా అంటూ ప్రశ్నించారు. ‘‘ఎండలు, తాగునీటి సమస్యపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తే ఈసీకి వచ్చిన ఇబ్బందేంటి?సమీక్ష నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోకపోతే ఎండా కాలంలో ప్రజల పరిస్థితి ఏమిటి? ఈ అంశంపై ఎన్నికల సంఘం ఎందుకు ఆలోచించటం లేదు?’’ అని లోకేశ్‌ ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి జరిపే సమీక్షల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా డీజీపీ కూడా పాల్గొంటున్నారని.. పౌరసంబంధాల శాఖ అధికారికంగా ప్రకటనలు కూడా విడుదల చేస్తోందన్నారు. అక్కడ వర్తించని కోడ్ ఏపీకి ఎందుకని లోకేశ్‌ నిలదీశారు.