Home అంతర్జాతీయం ‘ఆ ఆధారాలతో మోదీ జైలుకే’

‘ఆ ఆధారాలతో మోదీ జైలుకే’

దిల్లీ: కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కనీస ఆదాయ పథకం ‘న్యాయ్‌’తో దేశ ఆర్థిక వ్యవస్థ  తిరిగి గాడిలో పడుతుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. ఈ పథకం ఆర్థిక వ్యవస్థకు ఇంధనంలా పనిచేస్తుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో దీని అమలు కోసం ప్రజలపై పన్ను భారం మోపబోమని హామీ ఇచ్చారు. ‘‘న్యాయ్‌ పథకం గాడి తప్పిన భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తుంది. ఇంజిన్‌కి పెట్రోల్‌ శక్తినిచ్చినట్లే న్యాయ్‌తో ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపు లభిస్తుంది. దీంతో పేద ప్రజల చేతికి డబ్బు అందుతుంది. డిమాండ్‌ పెరుగుతుంది. తద్వారా  ఉత్పాదక రంగం ఊపందుకుంటుంది’’ అని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్‌ వ్యాఖ్యానించారు. 

తాము అధికారంలోకి వస్తే రఫేల్‌ ఒప్పందంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతామని రాహుల్‌ తెలిపారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ కచ్చితంగా జైలుకి వెళ్లాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ‘ది హిందూ’ పత్రిక బయటపెట్టిన పత్రాలతో మోదీ పాత్ర బట్టబయలైందన్నారు. చర్చల బృందాన్ని పక్కనపెట్టి మోదీ నేరుగా ‘డసో’ కంపెనీతో బేరసారాలు జరిపారని ఆరోపించారు. మోదీని జైలుకు పంపడానికి ఈ ఆధారాలు చాలని వ్యాఖ్యానించారు. ఈ ఐదేళ్లలో ప్రజల కొనుగోలు శక్తిని భాజపా ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. నిరుద్యోగం, రైతాంగ సంక్షోభం, అవినీతి లాంటి సమస్యలకు మోదీ ఎలాంటి పరిష్కారం చూపలేకపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వీటిపై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. కులాలను ఓటు బ్యాంకుగా చూడడాన్ని తాము పూర్తి వ్యతిరేకమన్నారు. అలాగే ఎన్నికల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో కుదుర్చుకొన్న పొత్తులు.. కచ్చితంగా కాంగ్రెస్‌ కూటమికి లాభిస్తాయని అభిప్రాయపడ్డారు. ఆయా రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రియాంక, జ్యోతిరాధిత్య సింధియా రాకతో యూపీలోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం కేవలం బడా పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు.