Home ఆంధ్ర ప్రదేశ్ ఏపీ, తెలంగాణలో నేడూ వర్షం

ఏపీ, తెలంగాణలో నేడూ వర్షం

ఈనాడు, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఆదివారం మధ్యాహ్నంనుంచి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక వరకు 1.5 కి.మీ.ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వివరించారు. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వివరించారు. ఉత్తర కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 0.9కి.మీ.ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ప్రకటించారు. దీని ప్రభావంతో ఆదివారం కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని, గంటకు 50కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రత్యేకించి కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొన్నారు. రాయలసీమ, తెలంగాణల్లో వర్ష ప్రభావం లేనిచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా రెండు, మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. శనివారం విశాఖ విమానాశ్రయంలో రెండు సెం.మీ.లు, వాల్తేరులో ఒకటి, ఎస్‌.కోటలో ఐదు సెం.మీ.ల వర్షం కురిసినట్లు వెల్లడించారు.