Home Uncategorized కమల్‌, రజనీ కలిసి సాగుతారా..!

కమల్‌, రజనీ కలిసి సాగుతారా..!

శాసనసభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న అగ్ర నటులు

ఎంఎన్‌ఎంతో ప్రజల్లోకి వెళ్లి ఆకట్టుకున్న కమల్‌

 పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిన రజనీ

 రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కానున్న ఇద్దరు మిత్రులు

ఈనాడు డిజిటల్‌, చెన్నై: రాష్ట్ర రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలికేందుకు ఇద్దరు అగ్రనటులు పోటీ పడుతున్నారు. విలక్షణ నటనలో ఎవరికి వారే అన్నట్లు పోటీ పడి నటించిన వారు దశాబ్దాలుగా సినీ రంగంలో అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వారు వేసే ప్రతి అడుగూ వార్తగా మారి హల్‌చల్‌ చేస్తోంది. అనుకోకుండా ఒకరు, దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ మరొకరు ఇంచుమించు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఒకరు పార్టీని ప్రారంభించి ఏకంగా ప్రజల్లోకి దూసుకెళ్లడమే కాకుండా తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపి ఔరా అనిపించారు. ఇదే సమయంలో రాజకీయ ప్రవేశ ప్రకటన నాటకీయ పరిణామాల మధ్య చేసినట్లే… పార్టీ ప్రారంభంపైనా ఉత్కంఠ రేపుతున్న మరో నటుడు దాన్ని అలానే కొనసాగిస్తున్నారు. ఆ ఇద్దరే లోకనాయకుడు కమల్‌హాసన్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఇద్దరూ రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తామని చెబుతూ నూతన రాజకీయాలను పరిచయం చేస్తామంటున్నారు. ఈ క్రమంలో కలిసి పనిచేస్తారా అనే ప్రశ్న మాత్రం దేశవ్యాప్తంగా చర్చకు దారిదీసింది. ఇటీవల ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఎప్పుడు శాసనసభ ఎన్నికలు వచ్చినా పోటీకి సిద్ధంగా ఉన్నామని రజనీ పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి కొంచెం ముందు ప్రచారంలో రజనీ తమ అభ్యర్థులకు మద్దతు తెలుపుతారని కమల్‌ చెప్పడం, తర్వాత దానిపై రజనీ మాట్లాడుతూ తమ మధ్య సంబంధాలను చెడగొట్టవద్దని హితవు పలకడం చకచకా జరిగిపోయాయి. పార్టీని ప్రారంభించకపోవడం, ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో రజనీకాంత్‌ రాజకీయాల నుంచి నిష్క్రమిస్తారనే ప్రచారం సాగింది. ఈ క్రమంలో రజనీ ప్రకటన మరోసారి రాష్ట్రంలో చర్చకు దారితీసింది.

రాజకీయ ప్రవేశం ఇలా…

కమల్‌హాసన్‌ బాల్యం నుంచే నటిస్తున్నారు. రజనీకాంత్‌ అనుకోకుండా నటనవైపు అడుగులు వేశారు. ఇద్దరి గురువూ ఒక్కరే. విలక్షణ నటనలో ఇద్దరూ ఇద్దరే. పాత్ర తప్ప అది చేస్తున్నది నటుడనే సంగతే తెలియకుండా విశ్వరూపం చూపించే నటుడు కమల్‌హాసన్‌. తన హావభావాలు, ప్రత్యేక మేనరిజంతో అభిమానులను ఉర్రూతలూగించే నటుడు రజనీకాంత్‌. దశాబ్దాలుగా వెండితెరపై వెలుగులీనుతూ…. సామాజిక స్పృహతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడూ ఇద్దరు వార్తల్లో ఉండే వారు. ఒకేసారి 2017లో రాజకీయ ప్రవేశానికి ముహూర్తం పెట్టేసుకున్నారు. సినిమా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో అందులో ప్రత్యేక నటనతో ఆకట్టుకునే ఆ నటులను నెత్తిన పెట్టుకునే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తర్వాత రజనీకాంత్‌ మక్కల్‌ మండ్రంతో సరిపెట్టుకుని సినిమాలపై దృష్టి పెట్టగా… అదే సమయంలో కమల్‌హాసన్‌ మాత్రం ఏకంగా మక్కల్‌ నీది మయ్యం పార్టీని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో హోరెత్తించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపి ఒంటరి పోరుతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. రాష్ట్రంలో 10 శాతం ఓట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజా ఎన్నికలకు ముందు తాము పోటీ చేయబోమని స్పష్టం చేసిన రజనీ… వచ్యే అసెంబ్లీ ఎన్నికలే తమ లక్ష్యమని ప్రకటించడంతో సరిపెట్టారు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే శాసనసభ ఎన్నికలకు సిద్ధమన్న ప్రకటనతో సంచలనం సృష్టించారు. దీంతో నటనలో పోటీపడి నటించినట్లు రాజకీయంగాకూడా పోటీ పడతారా అనే చర్చకు తెరలేచింది. పార్టీ ప్రారంభానికి ముందే సంస్థాగత నిర్మాణంపై రజనీ దృష్టి పెట్టారని, అందుకు అనుగుణంగా అసెంబ్లీ ఎన్నికలపై కన్నేశారని, తప్పకుండా తలైవా అనుకున్నది చేస్తారని ఆర్‌ఎంఎం సభ్యుడు ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు జయలలిత, కరుణానిధి లేమి ఏర్పడిన శూన్యతను వీరు పూరిస్తారన్న కోణంలో వారి ప్రతి అడుగును రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అందుకే వారు ఏమి చేసినా వార్తలవుతున్నాయి.

తాజా పరిస్థితుల్లో…

రాష్ట్రంలో యాభై సంవత్సరాలుగా అన్నాడీఎంకే, డీఎంకేల మధ్య దోబూచులాడుతున్న అధికారాన్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని జాతీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగా ఆ రెండు పార్టీలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ మేరకు కాంగ్రెస్‌, భాజపాలు డీఎంకే, అన్నాడీఎంకేలతో పొత్తులు కూడా పెట్టుకున్నాయి. ఈ ఎన్నికల్లో రజనీకాంత్‌ బరిలో దిగలేదు. అందరి దృష్టి స్టాలిన్‌, రాహుల్‌, మోదీ, పళనిస్వామి, పన్నీర్‌సెల్వంలపై పడింది. ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 23న వెలువడనున్నాయి. అంతకంటే ముందు మే నెల 19న నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల రద్దు అయిన వేలూరు లోక్‌సభకు కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫలితాల్లో డీఎంకే సత్తా చాటకపోతే ఆ పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అప్పుడు అన్నాడీఎంకే సర్కారు పూర్తి కాలం కొనసాగనుంది. అప్పటికి రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ పూర్తిస్థాయిలో సిద్ధమై అనుభవంతో ఎన్నికల సంగ్రామంలోకి అడుగుపెట్టే అవకాశాలు ఉంటాయి. వారిద్దరి ఆశయాలు, రాజకీయ ఉద్దేశాలు, లక్ష్యాలు ఒకేలా ఉండటంతో అప్పటికి ఇద్దరూ కలిసి బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు. అప్పుడు ప్రధాన పార్టీలు సత్తా చాటడం నల్లేరుపై నడక మాత్రం కాదు.