Home తెలంగాణ తెరాసలోకి త్వరలో మరో ముగ్గురు..!

తెరాసలోకి త్వరలో మరో ముగ్గురు..!

రెండు, మూడు రోజుల్ల  సీఎంతో భేటీ అయ్యే అవకాశం
కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదా గల్లంతు చేయాలని తెరాస వ్యూహం

ఈనాడు, హైదరాబాద్‌: ఇతర పార్టీలకు చెందిన మరికొందరు శాసనసభ్యులు రెండు, మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. సన్నాహాలు మొదలయ్యాయి. శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు, తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెరాసలో చేరుతామని ప్రకటించారు. తాజాగా మరో ముగ్గురు శాసనసభ్యుల నుంచి అధికార పార్టీకి సంకేతాలు అందాయి. తన సతీమణికి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పీఠం ఇవ్వాలని ఒక ఎమ్మెల్యే ప్రతిపాదించారు. ఇంకో ఇద్దరు పరోక్షంగా పార్టీ మార్పిడి గురించి వాఖ్యలు చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ ముగ్గురు సీఎంతో భేటీ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ ఎన్నికల్లో 19 స్థానాలు గెలిచింది. ఇందులో 10 మంది- సబితారెడ్డి (మహేశ్వరం) జాజాల సురేందర్‌ (ఎల్లారెడ్డి), రేగ కాంతారావు (పినపాక), కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు), హరిప్రియ (ఇల్లందు), వనమా వెంకటేశ్వర్‌రావు (కొత్తగూడెం), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్‌) దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (ఎల్బీనగర్‌), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌) తెరాసలో చేరతామని ప్రకటించారు. మరో ముగ్గురు చేరితే ఈ సంఖ్య కాంగ్రెస్‌ బలంలో మూడింట రెండొంతులవుతుంది. అప్పుడు వారు కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని తెరాసలో విలీనం చేయాలని శాసనసభాపతికి లేఖ రాస్తే ఆ ప్రక్రియ జరిగే వీలుంది. గతంలో తెదేపా శాసనసభాపక్షం, కాంగ్రెస్‌ శాసనమండలి పక్షం ఇలాగే తెరాసలో విలీనమయ్యాయి. ఇదే వ్యూహంతో తెరాస, కాంగ్రెస్‌ అసమ్మతి వర్గం ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇది జరిగితే కాంగ్రెస్‌ పార్టీ శాసనసభలో విపక్ష హోదాను కోల్పోతుంది. సభలో మొత్తం బలంలో పదో వంతు సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. 120 మంది సభ్యులు గల శాసనసభలో ఇప్పటికే తెరాసకు 91 మంది సభ్యులుండగా.. కాంగ్రెస్‌ నుంచి 13, తెదేపా నుంచి ఒకరు చేరితే తెరాస బలం 105కి చేరుతుంది.