Home Uncategorized పేద కుటుంబాల్లో పెను విషాదం

పేద కుటుంబాల్లో పెను విషాదం

మిన్నంటిన నందిమేడారం మృతుల కుటుంబీకుల రోదనలు
న్యాయం చేయాని ఠాణా ఎదుట రాస్తారోకో

ధర్మారం, న్యూస్‌టుడే: ధర్మారం శివారులో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో నందిమేడారానికి చెందిన ఎండీ.షఫీ, కందుకూరి నర్సింహాచారి మృతిచెందిన విషయం విధితమే. ఈ దుర్ఘటన రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కాగా తమకు సమాచారం లేకుండానే ప్రమాద స్థలం నుంచి మృతదేహాలను తరలించారని శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ధర్మారం ఠాణా ఎదుట బాధిత కుటుంబీకులు, నందిమేడారం గ్రామస్థులు రాస్తారోకో చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వందలాదిగా గ్రామస్థులు నిరసనలో పాల్గొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ధర్మారం-కరీంనగర్‌ మార్గంలో వాహనాలను దారి మళ్లించారు. పెద్దపల్లి ఏసీపీ వెంకటరమణారెడ్డి, సీఐ నరేందర్‌ మృతుల బంధువులకు నచ్చజెప్పారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవరుపై కేసు నమోదు చేస్తామని, మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. నిరసనకు జగిత్యాల డీసీసీ ఛైర్మన్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్‌, నందిమేడారానికి చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మరోవైపు నిరసన నేపథ్యంలో ప్రమాద స్థలానికి దగ్గర్లోని కంకర క్రషర్లో శనివారం కార్యకలాపాలు నిలిపివేశారు. కంకర, బండరాళ్లు తరలించే లారీలు ఈ మార్గంలో నడవలేదు. మృతదేహాలను శుక్రవారం రాత్రి కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించినప్పటికీ తమకు న్యాయం జరిగేవరకు ఫిర్యాదు చేయబోమని మృతుల బంధువులు స్పష్టం చేశారు. ఫిర్యాదు అందక పోవడంతో శనివారం సాయంత్రం వరకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించలేదు. వాదోపవాదాలు, చర్చల అనంతరం శనివారం రాత్రి మృతుల బందువుల ఫిర్యాదుతో ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ తిరుపతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.ప్రేమ్‌కుమార్‌ తెలిపారు.

ఆ కుటుంబాలకు వీరిద్దరే ఆధారం…
ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరివీ పేద కుటుంబాలే. రెండు కుటుంబాలకు ఎలాంటి ఆస్తులు లేవు. రోజంతా కష్టపడితేనే కుటుంబం నడిచే పరిస్థితి. నర్సింహాచారి స్వర్ణకార వృతితో కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నారు. ఆయనకు భార్య, మగ్గురు కూతుళ్లున్నారు. ఈ సంవత్సరం పెద్ద కూతురుకు పెళ్లి చేయాలనే ఆలోచనతో ఉన్నారు. శుక్రవారం రాత్రి ధర్మారంలో తాగునీరు తెచ్చేందుకు వెళ్తున్నాని చెప్పి క్యాను పట్టుకొని వెళ్లిన నర్సింహాచారి.. ప్రమాదానికి గురై మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎండీ.షఫీకి ఎలాంటి ఆస్తులు లేకపోగా జీవనోపాధికి గల్ఫ్‌ దేశాలకు వెళ్తూ పొట్టపోసుకుంటున్నాడు. ఇతనికి భార్య ఇద్దరు కూతుళ్లున్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న షఫీ మృతితో ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. కాగా మృతులిద్దరూ ప్రాణ స్నేహితులు. ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై వస్తూ లారీ ఢీకొట్టడంతో మృతిచెందడం గ్రామంలో విషాదం నింపింది.