Home తెలంగాణ మెట్రోని వణికిస్తున్న గాలివాన!

మెట్రోని వణికిస్తున్న గాలివాన!

ఫ్లెక్సీ పడటం, సిగ్నలింగ్‌ లోపాలతో రెండుసార్లు నిల్చిన రైళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రోరైలు సేవలకు తరచూ సాంకేతిక సమస్యలు అవరోధంగా మారుతున్నాయి. తాజాగా 30 గంటల వ్యవధిలో ఏకంగా మూడు చోట్ల మెట్రోరైళ్లు ఆగిపోయాయి. ప్రతిసారి అరగంటకు పైగానే మెట్రో సేవలు నిల్చిపోవడంతో ఆ ప్రభావం కారిడార్‌ మొత్తంపై పడింది. వేలమంది మెట్రోలో ఉన్న వారు, స్టేషన్లలో ఎదురుచూస్తున్న ప్రయాణికులు ఆలస్యం కారణంగా ఇబ్బంది పడ్డారు. భారీ వర్షం పడి వరదలొచ్చినా.. రహదారులు నీట మునిగినా  అవంతరాలు లేకుండా మెట్రోలో గమ్యస్థానం చేరొచ్చు అనేది అన్నివేళల్లో నిజం కాదని మరోసారి వెల్లడైంది.

* ఈదురుగాలులకు ఓ ఫ్లెక్సీ మియాపూర్‌ స్టేషన్‌ సమీపంలో మెట్రో విద్యుత్తు తీగలపై పడటంతో శనివారం మూసాపేట-మియాపూర్‌ మధ్యలో అరగంట పాటు మెట్రోసేవలు నిల్చిపోయాయి. ఈ ప్రభావం కారిడార్‌ మొత్తంపై పడింది. 4.15 గంటలకు మెట్రోసేవలను పునరుద్ధరించారు. 
* ఉదయం సిగ్నలింగ్‌ వ్యవస్థలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మెట్రో రైళ్లు ఆగిపోయాయి. దీంతో స్టేషన్లలో మెట్రో కోసం ఎదురుచూసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సమస్యను గుర్తించి సరిచేసిన అనంతరం  ఎల్‌బీనగర్‌-మియాపూర్‌ మార్గంలో మెట్రోని నడిపారు. ఒకేరోజు ఒకే మార్గంలో రెండుసార్లు మెట్రో సేవలు ఆగిపోవడమంటే మెట్రో నిర్వాహణ లోపాలను బహిర్గతం చేస్తోందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. 
* శుక్రవారం రాత్రి మెరుపులు, పిడుగులతో పెద్దమ్మగుడి-మాదాపూర్‌ స్టేషన్ల మధ్యన ఉన్న హైటెన్షన్‌ ఓవర్‌హెడ్‌ లైన్లు ట్రిప్పయ్యాయి. దీంతో రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 12 నిమిషాలకు ఒక మెట్రో రావాల్సిన చోట అరగంటైనా రాకపోవడంతో హైటెక్‌సిటీ, దుర్గం చెరువు స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో దర్శనమిచ్చాయి. 
* రసూల్‌పురా వద్ద ఫ్లెక్సీ పడటంతో హైటెక్‌సిటీ-నాగోల్‌ మార్గంలో మెట్రో నిల్చిపోయింది. ః బేగంపేటలోనూ గతంలో ఫ్లెక్సీ పడింది. 
* విద్యుత్తు కేబుల్‌ తెగిపడి కూకట్‌పల్లి సమీపంలో మెట్రో నిల్చిపోయింది. 
* సిగ్నలింగ్‌లో సాంకేతిక సమస్యతో బేగంపేటలో అంతకుముందు మెట్రో నిల్చిపోయింది. ఇటీవల జూబ్లీహిల్స్‌లో ఆగిపోయింది. ః కాలుష్యం కారణంగా తలెత్తిన సాంకేతిక సమస్యతో నాగోల్‌లో మెట్రో ఆగిపోయింది. 
* నగరంలో కాలుష్యం పెరగడంతో మెట్రోలోని సున్నిత పరికరాలు దెబ్బతిని సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. సమస్య నివారణకు చర్యలు చేపడతాం. మియాపూర్‌ స్టేషన్‌ సమీపంలో ఓవర్‌హెడ్‌ విద్యుత్తు తీగపై ఫ్లెక్సీ పడింది. దీంతో 15 నిమిషాల పాటు విద్యుత్తు సరఫరా నిలిపేయడంతో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య సాయంత్రం వేళ తలెత్తడంతో మెట్రోరైళ్లన్ని మరింత రద్దీగా మారాయి.

– ఎన్వీఎస్‌ రెడ్డి, ఎండీ, హైదరాబాద్‌ మెట్రోరైలు