Home Uncategorized వారి నకిలీ పొత్తుకు మే 23తో ఆఖరు:మోదీ

వారి నకిలీ పొత్తుకు మే 23తో ఆఖరు:మోదీ

ఇటావా: ఎస్పీ-బీఎస్పీ నకిలీ పొత్తు మే 23తో ముగుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చేశారు. శనివారం ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావాలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించడంతో పాటు, విపక్షాలపై విమర్శలు చేశారు. 
వృద్ధులకు పెన్షన్లు అందిస్తున్నామని, ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద ప్రజలు ప్రయోజనం పొందుతున్నారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ‘ఎస్పీ, బీఎస్పీ జెండాలు వేరైనా, వాటి ఆలోచనలు మాత్రం ఒక్కటే. వారి హయాంలో రైతులను దోచుకున్నారు. దళితులను వేధించారు. మహిళలకు భద్రత కొరవడింది. మాయావతి ఆ విషయాన్ని మర్చిపోయుంటారు’ అని విమర్శించారు. ఎస్పీ పార్టీ పేద ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించదని, వారి బంగ్లాలను మరింత సుందరంగా తీర్చిదిద్దడం గురించే ఆ పార్టీ నేతలు ఆలోచిస్తారని మండిపడ్డారు. ‘లోక్‌సభ ఎన్నికలు ముగియగానే ఎస్పీ-బీఎస్పీ పొత్తు కూడా ముగుస్తుంది. దానికి చివరి రోజు మే 23. తరవాత వారు ఒకరికొకరు శత్రువులుగా మారిపోతారు’ అని ప్రధాని జోస్యం చెప్పారు. గత ఐదు సంవత్సరాల కాలంలో తమ ప్రభుత్వంలో ఎటువంటి పేలుళ్లు సంభవించలేదని తెలిపారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ ఇదంతా చేయగలవా అని ప్రశ్నించారు. ఇవేవీ మోదీ ఒంటరిగా చేయలేరని, ప్రజల ఓటు వల్లే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.