Home జాతీయం సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు

సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు

ఖండించిన జస్టిస్‌ రంజన్‌ గొగొయి
ఉన్నపళంగా సెలవునాడు విచారణ
స్వీయ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం
ఆరోపణల వెనుక ‘పెద్ద శక్తి’ ఉంది
సీజేఐ ఆక్షేపణ

దీని వెనుక చాలా ‘పెద్ద శక్తి’ ఉంది. ఇప్పుడు రెండు కార్యాలయాలు ఉన్నాయి. ఒకటి ప్రధాన మంత్రి కార్యాలయం, రెండోది సీజేఐ కార్యాలయం. వారి (ఈ వివాదం వెనుక ఉన్నవారు) ఉద్దేశం.. సీజేఐ కార్యాలయాన్ని నిర్వీర్యం చేయడమే. వచ్చే వారంలో సుప్రీంకోర్టులో అత్యంత ప్రధానమైన కేసులను విచారించాల్సిన తరుణంలో ఈ ఆరోపణలు తెరమీదకి వచ్చాయి. పైగా దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి.
* న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు పెను ముప్పు ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా జరగనివ్వను.

ఈనాడు-దిల్లీ

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో శనివారం అనూహ్య, అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయిపై సుప్రీంకోర్టు మహిళా ఉద్యోగి ఒకరు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ విషయం పలు న్యూస్‌ పోర్టళ్లలో రావడం, వారు దీనిపై సీజేఐని వివరణ కోరడంతో జస్టిస్‌ గొగొయి దీనిపై విచారణకు తన నేతృత్వంలో జస్టిస్‌ అరుణ్‌ మిశ్ర, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేశారు. శనివారం సెలవైనప్పటికీ సదరు ధర్మాసనం ప్రత్యేకంగా సమావేశమైంది. తనపై వచ్చిన ఆరోపణలు పెద్ద కుట్ర అని సీజేఐ ఆరోపించారు. సీజేఐ కార్యాలయాన్ని నిర్వీర్యం చేసే ఉద్దేశంతో ఒక ‘పెద్ద శక్తి’ చేస్తున్న ప్రయత్నమని మండిపడ్డారు. ఈ శక్తి ఎవరన్నది ఆయన వెల్లడించలేదు. ఈ వ్యవహారంలో బాధ్యతగా వ్యవహరిస్తూ సంయమనం పాటిస్తూ న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతినకుండా చూసే అంశాన్ని మీడియా విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది.
సదరు మహిళ ఫిర్యాదుపై న్యూస్‌ పోర్టళ్లలో కథనాలు రావడంతో సుప్రీం కోర్టు శనివారం హడావుడిగా విచారణ చేపట్టింది. ‘స్వతంత్ర న్యాయవ్యవస్థకు సంబంధించిన అత్యంత ప్రాధాన్య అంశం’పై త్రిసభ్య ధర్మాసనం సమావేశం అవుతున్నట్లు రిజిస్ట్రీ తన నోటీసులో పేర్కొంది. దాదాపు అరగంట పాటు సాగిన విచారణలో సీజీఐ మాట్లాడుతూ ‘‘జడ్జీగా 20 ఏళ్ల పాటు నిస్వార్థ సేవలు అందించాక ఈ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు నమ్మశక్యంగా లేవు. ప్రధాన న్యాయమూర్తిగా ఈ ప్రత్యేక విచారణను చేపట్టాల్సిన బాధ్యత నాదే. పరిస్థితులు ఇప్పటికే చాలా దూరం పోవడం వల్లే నేను ఈ అసాధారణ చర్యను చేపట్టా. ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయ వ్యవస్థను బలిపశువును కానివ్వను’’ అని పేర్కొన్నారు. తన పరిధిలో పనిచేసిన ప్రతి ఉద్యోగి పట్ల చాలా నిజాయతీగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించానని చెప్పారు. ‘‘ప్రస్తుతం ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగి మూడున్నర నెలలపాటు నావద్ద పనిచేశారు.

ఇప్పుడు నాపై వచ్చిన ఆరోపణలను ఖండించేంత స్థాయికి కూడా నేను దిగజారాలనిపించడంలేదు. దీనిపై నేను ఎలాంటి ఉత్తర్వులూ జారీచేయడంలేదు. ధర్మాసనంలో అత్యంత సీనియర్‌ అయిన జస్టిస్‌ అరుణ్‌ మిశ్ర ఉత్తర్వులు జారీ చేస్తారు’’ అని పేర్కొన్నారు. ఈ ఆరోపణల వెనుక కుట్ర ఉన్నట్లు ఆయన ఆరోపించారు. ‘‘20 ఏళ్ల సేవల తర్వాత నాకు దక్కిన బహుమతి ఇది. దీని వెనుక చాలా ‘పెద్ద శక్తి’ ఉంది. ఇప్పుడు రెండు కార్యాలయాలు ఉన్నాయి. ఒకటి ప్రధాన మంత్రి కార్యాలయం, రెండోది సీజేఐ కార్యాలయం. వారి (ఈ వివాదం వెనుక ఉన్నవారు) ఉద్దేశం సీజేఐ కార్యాలయాన్ని నిర్వీర్యం చేయడమే. వచ్చే వారంలో సుప్రీంకోర్టులో అత్యంత ప్రధానమైన కేసులను విచారించాల్సిన తరుణంలో ఈ ఆరోపణలు తెరమీదకి వచ్చాయి. పైగా దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి’’ అని పేర్కొన్నారు. అయినా తాను తనకు మిగిలిన 7 నెలల పదవీకాలంలో ఇదే ధర్మాసనంపై కూర్చొని ఎలాంటి భయం లేకుండా విధులు నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.

డబ్బు విషయంలో ఎవరూ వేలెత్తి చూపలేరు
డబ్బు విషయంలో తనను ఎవరూ వేలెత్తి చూపలేరని జస్టిస్‌ గొగొయి పేర్కొన్నారు. ‘‘నన్ను లక్ష్యంగా చేసుకోవాలంటే వేరే అంశాలను ఎంచుకోవాలి. వాళ్లు దీన్ని ఎంచుకున్నారు. రెండు దశాబ్దాల సర్వీసు తర్వాత ప్రస్తుతం నా బ్యాంకు ఖాతాలో రూ.6.80 లక్షలుంది. భవిష్య నిధి ఖాతాలో రూ.40లక్షలు ఉంది. నా ఆస్తి మొత్తం ఇదే. నేను న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేనాటికి నా దగ్గర ఇంత కన్నా ఎక్కువ సొమ్ము ఉండేది. ఇప్పుడు నా ప్యూన్‌ వద్ద నా కన్నా ఎక్కువ సొమ్ము ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

ఇలా అయితే జడ్జీ పదవుల్లోకి ఎవరు వస్తారు?
న్యాయమూర్తికి ఉండే ఏకైక ఆస్తి ప్రతిష్ఠేనని సీజేఐ అన్నారు. లైంగిక వేధింపులు వంటి నిరాధార ఆరోపణలతో ఆ ప్రతిష్ఠ మీదే దాడి చేస్తే ‘బుద్ధి ఉన్న’ వాళ్లెవరూ న్యాయమూర్తి పదవిని చేపట్టేందుకు ముందుకు రారని చెప్పారు. ‘‘ఇలాంటివి జరుగుతుంటే కేసులను న్యాయమూర్తి ఎలా పరిష్కరించగలుగుతారు? కేసులను వాయిదా వేసుకుంటూ పోతారు’’ అని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు పెను ముప్పు ఏర్పడిందని, ఇది చాలా దయనీయమని అన్నారు. ఇలా జరగనీయబోనని స్పష్టం చేశారు.

ఆమెపై కేసులు ఉన్నాయి
తనపై ఆరోపణలు చేసిన మహిళకు నేర నేపథ్యం ఉందని, ఆమెపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని జస్టిస్‌ గొగొయి గుర్తు చేశారు. సుప్రీం కోర్టులో ఆమె చేరేనాటికి ఆమెపై ఒక ఎఫ్‌ఐఆర్‌ పెండింగ్‌లో ఉంది. అలాంటి వ్యక్తిని సుప్రీం కోర్టులోకి ఎలా తీసుకున్నారు? ఆమె భర్తపై కూడా రెండు క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక కేసులో ఆమె అరెస్టయ్యింది. ఆ తర్వాత బెయిలు పొందింది. ఇదే కేసులో ఫిర్యాదుదారుపై బెదిరింపులకు పాల్పడింది. నేర చరిత్ర వల్ల ఆమె నాలుగు రోజుల పాటు జైల్లో ఉంది. పద్ధతి మార్చుకోవాలని పోలీసులు కూడా పలుమార్లు ఆమెను హెచ్చరించారు. ఆమెకు బెయిలు రద్దు చేయాలని పోలీసులు ఇప్పటికే దిల్లీలోని ట్రయల్‌ కోర్టును ఆశ్రయించారు. నేడు (శనివారం) దానిపై విచారణ జరగాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు.

ఒకే తీరులో ప్రశ్నలు
సదరు మహిళ చేసిన ఆరోపణలను నాలుగు వెబ్‌ పోర్టళ్లు కథనాలను ప్రచురించాయని సీజేఐ పేర్కొన్నారు. దీనిపై ఆ మాధ్యమాలు తన కార్యాలయ స్పందన కోరాయన్నారు. ‘‘ఆ కమ్యూనికేషన్లు, సంధించిన ప్రశ్నలు ఒకేలా ఉన్నాయి. సీజేఐ స్పందన కోసం ఐదు గంటల కన్నా తక్కువ సమయాన్ని ఇచ్చాయి’’ అని తెలిపారు.

బెదిరింపు ఎత్తుగడలు
ఈ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ ఇవన్నీ బెదిరింపు ఎత్తుగడలని వ్యాఖ్యానించారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసిన సదరు మహిళపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. గతంలోనూ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తిపైన, ఒక సీనియర్‌ న్యాయవాదిపైన ఇలాంటి ఆరోపణలు వచ్చాయని అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ పేర్కొన్నారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఎలాంటి అంశాలనూ ప్రచురించరాదని మీడియాకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. తాజాగా సీజేఐ చేసిన చేసి ప్రకటనకు సాధ్యమైనంత విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ఆరోపణల విషయంలో ఫిర్యాదుదారు, ప్రతివాది పేరును వెల్లడించరాదని చట్టం చెబుతున్నప్పటికీ తాజా ఉదంతంలో న్యూస్‌ పోర్టళ్లు వాటిని ప్రచురించాయని పేర్కొన్నారు.

జస్టిస్‌ అరుణ్‌మిశ్ర స్పందిస్తూ న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఆందోళన నెలకొందన్నారు. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా మాట్లాడుతూ.. కేసులు పరిష్కరించాల్సిన న్యాయమూర్తులపై ఇలాంటి ఒత్తిడి పెట్టడం తగదన్నారు. ‘‘ఆరోపణలు చేసిన సదరు మహిళా ఉద్యోగిని నిర్దేశిత ప్రక్రియ పాటించాక ఉద్యోగం నుంచి తొలగించారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

మీడియా విచక్షణకే
ఈ కేసు విచారణ అనంతరం జస్టిస్‌ అరుణ్‌మిశ్ర, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలు సంక్షిప్త ఉత్తర్వు జారీచేశారు. ‘‘ఈ విషయం పరిశీలించిన తర్వాత దీనిపై ప్రస్తుతానికి మేం న్యాయపరమైన ఎలాంటి ఆదేశాలివ్వడంలేదు. ఇదే సమయంలో దీనిపై ఎంత సంయమనం, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న అంశాన్ని మీడియా విజ్ఞతకే వదిలేస్తున్నాం. స్వతంత్ర న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు సరిదిద్దలేని నష్టం కలిగించడంతోపాటు, తక్కువచేసి చూపించడానికి చేసిన ఇలాంటి అనైతికమైన ఆరోపణలను ప్రచురించాలా, వద్దా అన్న నిర్ణయాధికారాన్ని వారికే వదిలేస్తున్నాం. ఇలాంటి యోగ్యతలేని ఆరోపణలవల్ల న్యాయవ్యవస్థపై ప్రజలకున్న ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుంది’’ అని పేర్కొన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఆమె ఫిర్యాదును ప్రచురించాల్సింది కాదన్నారు.

ఇవీ ఆరోపణలు
సీజేఐ నివాసంలోని కార్యాలయంలో తాను పనిచేస్తున్నప్పుడు జస్టిస్‌ రంజన్‌ గొగొయి తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని, ఆయన లైంగిక వేధింపులను ప్రతిఘటించడం వల్ల తనపై కక్షకట్టారని సదరు మాజీ మహిళా ఉద్యోగి శుక్రవారం 22 మంది న్యాయమూర్తులకు 24 పేజీల అఫిడవిట్‌తో పాటు సంక్షిప్త లేఖను పంపారు. 2018 అక్టోబర్‌ 10, 11 తేదీల్లో తాను సీజేఐ నివాసంలో విధి నిర్వహణలో ఉండగా ఆయన లైంగిక వేధింపులకు గురిచేసినట్లు పేర్కొన్నారు. తాను లొంగకపోవడంతో తనను ఉద్యోగంలోంచి తొలగించడంతోపాటు, తన భర్త, ఆయన సోదరుడిని ఉద్యోగాల నుంచి సస్పెండ్‌ చేశారని, తప్పుడు కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారని ఆరోపించారు. ఇవి శ్రుతి మించడంతో కోర్టుముందుకొచ్చినట్లు పేర్కొన్నారు. ‘‘నేను 2014 మే 1 నుంచి 2018 డిసెంబర్‌ వరకు సుప్రీంకోర్టు అసిస్టెంట్‌గా పనిచేశాను. 2018 అక్టోబర్‌లో నా భర్త సోదరుడికి ప్రధాన న్యాయమూర్తి విచక్షణ కోటా కింద సుప్రీం కోర్టులో గ్రూప్‌-డి ఉద్యోగం ఇప్పించారు. లైంగిక వేధింపులను ప్రతిఘటించడంతో నన్ను చాలా అమర్యాదకరంగా తొలగించారు. దిల్లీ పోలీసు శాఖలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నా భర్త, ఆయన సోదరుడిని కూడా సస్పెండ్‌ చేశారు. సుప్రీం కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2017లో హరియాణాకు చెందిన నవీన్‌ అనే వ్యక్తి నుంచి రూ.50వేల అడ్వాన్స్‌ తీసుకున్నట్లు నాపై ఈ ఏడాది మార్చి 3న తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దాని ఆధారంగా అదేరోజు రాత్రి నన్ను అరెస్టు చేశారు. నా భర్తను కూడా అదుపులోకి తీసుకొని చితకబాదారు. బెయిల్‌ తీసుకోవాలని నన్ను బలవంతం చేశారు. ఆ తర్వాత బెయిల్‌ రద్దుకోసం పోలీసులు దరఖాస్తుపెట్టారు. జస్టిస్‌ రంజన్‌ గొగొయి చేసిన లైంగిక వేధింపులకు లొంగకపోవడం వల్లే నన్ను, నా కుటుంబాన్ని బలిపశువును చేశారు. భయంతోనే దీనిపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా.  దీనిపై విచారణ జరిపించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో ప్రత్యేక విచారణ కమిటీ వేయాలి’’ అని ఆ మహిళ తన లేఖలో పేర్కొన్నారు. జస్టిస్‌ గొగొయి భార్య పాదాలకు సాష్టాంగ నమస్కారం చేయించారని, తన ముక్కును ఆమె పాదాలకు తాకించారని ఆరోపించారు.

విచారణకు రానున్న ముఖ్యమైన కేసులివే! దిల్లీ: రానున్న వారంలో ‘చాలా చాలా ముఖ్యమైన కేసుల’ను విచారించనున్నందువల్లనే తనపై ఆరోపణలు వచ్చినట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి ఆరోపించారు. అయితే ఆ కేసులు ఏమిటన్నది ఆయన వివరించలేదు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ న్యాయవాది చెప్పిన వివరాల ప్రకారం జస్టిస్‌ గొగొయి ఆధ్వర్యంలోని ధర్మాసనం సోమవారం నుంచి పలు కేసులను విచారించనుంది.
* రఫేల్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలను వక్రీకరించి ప్రచారం చేశారంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై దాఖలైన వ్యాజ్యాన్ని విచారించనుంది. దీనిపై రాహుల్‌ సమాధానం సమర్పించాల్సి ఉంది.
* పశ్చిమ బెంగాల్‌లోని చోటుచేసుకున్న చిట్‌ఫండ్‌ కుంభకోణంలో విచారణ నిమిత్తం కోల్‌కతా పోలీసు కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ చేసిన వినతిని సోమవారమే పరిశీలించనుంది.
* ప్రధాని నరేంద్రమోదీపై తీసిన సినిమా విడుదల చేయకుండా ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆ చిత్ర నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఈ వారంలోనే చేపట్టనుంది.
* అసోంకి చెందిన జాతీయ పౌర హక్కుల పట్టిక వ్యవహారంపై సోమవారంవిచారణ జరపనుంది.
* తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రజలకు భారీగా లంచాలు ఇచ్చారంటూ దాఖలైన వ్యాజ్యంపైనా సోమవారమే విచారణ చేపట్టనుంది.