Home Uncategorized ‘యతి’ నిజంగా ఉన్నాడా?

‘యతి’ నిజంగా ఉన్నాడా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘యతి’. మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పేరు. ఏకంగా భారత ఆర్మీనే హిమాలయాల్లో ఇవిగో యతి అడుగు జాడలు అంటూ కొన్ని ఫొటోలను ప్రజలతో పంచుకుంది. దీంతో ‘యతి’ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇప్పటివరకూ పురాణాలు, ఇతిహాసాల్లో మాత్రమే యతి గురించి విన్నాం. గతంలోనూ ఇలాంటి అనేక వార్తలు వచ్చాయి. దీనిపై భిన్నవాదనలూ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం!

యతి అంటే హనుమంతుడా..?
భారత పురాణాల ప్రకారం ఈ ప్రపంచంలో చిరంజీవులుగా పేర్కొన్న కొందరిలో హనుమంతుడు ఒకడు. ఇప్పటికీ ఆయన హిమాలయ పర్వత సానువుల్లో ఉన్నారని హిందూ భక్తుల విశ్వాసం. యతి పేరు ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ ఆంజనేయస్వామి అక్కడ తిరుగుతున్నారని భక్తులు నమ్ముతారు. అయితే, అందుకు ఆ కాలి జాడలు తప్ప మరో ఆధారం లేదు. ఇంకొందరు ఆ యతిని చూశామని ఎలుగుబంటి రూపంలో యతి సంచరిస్తున్నాడని, ఆయనే జాంబవంతుడని అంటారు. కానీ, ఎవరూ ఆ యతిని కలిసింది లేదు. ఇదంతా భక్తి, విశ్వాసాలకు సంబంధించిన అంశం. 

నేపాల్‌కు చెందిన అతి పురాతన మానవజాతి 
‘యతి’ గురించి చర్చ వచ్చినప్పుడల్లా వినపడే మరో వింత వాదన కూడా ఉంది. వారంతా నేపాల్‌కు చెందిన అతి పురాతన ఆటవిక తెగకు చెందిన వారిగా పేర్కొంటారు. వీరినే ‘మంచు మనిషులు’ అని కూడా పిలుస్తారు. సాధారణ మనిషి కన్నా ఎత్తులో ఉండే భారీ కోతి ఆకారంగా ఉండే వీరంతా హిమాలయాల్లో జీవిస్తుంటారని చెబుతారు. అంతేకాదు, ఈ జాతి సైబీరియా, తూర్పు ఆసియా దేశాల్లోనూ ఉన్నట్లు చెబుతారు. 

యతికి పేర్లు ఎన్నో..!
యతిగా పిలుస్తున్న వ్యక్తి/జంతువు ఏదైనా కావచ్చు.. దానికి అనేకమంది అనేక పేర్లతో పిలుస్తున్నారు. పురాణాల ప్రకారం ‘యతి’గా పేర్కొంటే, టిబెటియన్లు ‘కొండ ప్రాంతాల్లో ఉండే పెద్ద ఎలుగు’ అని చెబుతారు. అంతేకాదు, వీరినే ‘ఎలుగు మనిషి’ అని కూడా పిలుస్తారు. నేపాల్‌లోని ‘షెర్పాస్‌’ అనే తెగ యతిని ‘క్యాటిల్‌ బేర్‌’గా పేర్కొంటుంది. ‘హిమాలయన్‌ బ్రౌన్‌ బేర్‌’, ‘జంగిల్‌ మ్యాన్‌’, ‘స్నో మ్యాన్‌’, ‘మ్యాన్‌-బేర్‌ స్నోమెన్‌’ ఇలా అనేక పేర్లతో పిలుస్తారు. ఇక ప్రముఖ పర్వాతారోహకుడు రెనిహోల్డ్‌ మెస్నెనర్‌ యతిని అతి పురాతన మనిషిగా అభివర్ణిస్తాడు. 

1వ శతాబ్దంలోనే యతి ప్రస్తావన!
అసలు యతి ఉన్నాడన్న సంగతిని తొలిసారి 1వ శాతాబ్దంలో అధికారికంగా గుర్తించారని చరిత్ర చెబుతోంది. నేపాల్‌ తెగ ‘షెర్పాస్‌’ యతిని గుర్తించిందట. రోమన్‌ చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్‌ రచించిన  ‘నేచురల్‌ హిస్టరీ ఇన్‌ ది ఫస్ట్‌ సెంచరీ ఏడీ’ అనే పుస్తకంలో వనజీవిగా పేర్కొంటూ యతిని గురించి ప్రస్తావించారు. ఆ జీవి కొన్నిసార్లు నాలుగు కాళ్లపై, మరికొన్ని సార్లు మనిషిలా రెండుకాళ్లపై నడుస్తున్నట్లు చెప్పారు.  అది ప్రయాణించే వేగానికి దాన్ని పట్టుకోవడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఒకవేళ అది వృద్ధజీవి కావడం  లేదా, అనారోగ్యం పాలైతే దాన్ని పట్టుకోవచ్చని ప్లినీ రాశారు. దాని అరుపులు సైతం భయంకరంగా ఉన్నాయని, ఒళ్లంతా జట్టుతో, నీలం రంగు కళ్లు కలిగి, కుక్కలకు ఉండే పళ్లు ఉన్నాయని ప్లినీ పేర్కొన్నారు. 

1832లో పశ్చిమదేశాలకు తెలిసింది..
హిమాలయాల్లో యతి ఉనికి ఉన్నట్లు 1832లో పాశ్చాత్యదేశాలకు తెలిసింది. ‘ఆసియాటిక్‌ సొసైటీ ఆఫ్‌ బెంగాల్‌’ పేరుతో బ్రిటిషర్‌ బీహెచ్‌ హోడ్జ్‌సన్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు. అయితే అది ఎర్రని జట్టుతో కొండప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు రాశారు.

1899లో తొలిసారి యతి అడుగులు గురించి..
‘అమాంగ్‌ ది హిమాలయన్స్‌’ పేరుతో లారెన్స్‌ వాడెల్‌ 1899లో రాసిన పుస్తకంలో యతి అడుగు జాడల గురించి స్పష్టంగా చెప్పారు. యతి గురించి ఎన్నో కథలు స్థానికుల నుంచి విన్నానని చెప్పిన ఆయన, తొలిసారి యతి పాద ముద్రలను కూడా గుర్తించినట్లు చెప్పారు. 
పూర్తి వివరాలతో 1925లో..
ఎన్‌ఏ టాంబ్జి అనే గ్రీక్‌ ఫొటోగ్రాఫర్‌ హిమాలయాల్లో యతి గురించి స్పష్టమైన వివరాలను వెల్లడించారు. ‘అతను అచ్చం మనిషిలా ఉన్నాడు. అప్పుడప్పుడూ ఆగుతూ, వడివడిగా అడుగులు వేస్తున్నాడు. అతని ఒంటిపై దుస్తులేవీ లేవు. నేను ఫొటో తీసేలోపే ఆ యతి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. అయితే, అతని అడుగుజాడలను మాత్రం ఫొటో తీయగలిగాను. 16 నుంచి 24 అంగుళాల వెడల్పైన మొత్తం 15 అడుగులు గుర్తించా’ అని వెల్లడించాడు.

20వ శాతాబ్దంలో యతి ప్రస్తావన!
1920 నుంచి 1950 మధ్యకాలంలో యతి గురించి పరిశోధన చేసే వారి సంఖ్య పెరిగింది. దీంతో అనేకమంది హిమాలయాల్లో పరిశోధించారు. పలువురి యతి అడుగులను సైతం ఫొటోలు తీశారు. అయితే టెన్సింగ్ నార్కేతో కలిసి తొలిసారి ఎవరెస్ట్‌ని ఎక్కిన ఎడ్మండ్ హిల్లరీ మాత్రం యతి ఉన్నదన్న  మాటని కొట్టి పారేశారు. కనిపించిన పాదముద్రలు మనుష్యులవేనని మంచు కరగటం వల్ల అవి వ్యాకోచించి ఉంటాయని అభిప్రాయపడ్డారు. విస్తృతమైన పరిశోధనలు జరిగితే కానీ యతి ఉన్నదా? లేదా అన్నది తేలటం కష్టం. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ యతి అడుగు జాడలంటూ ఫొటోలు పంచుకోవడం ఆసక్తికరం.