Home Uncategorized విలీనం చట్టవిరుద్ధమైతే రద్దు చేస్తాం

విలీనం చట్టవిరుద్ధమైతే రద్దు చేస్తాం

ఆ అధికారం హైకోర్టుకు ఉంది
అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదు
కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో స్పష్టం చేసిన హైకోర్టు
విచారణ జూన్‌ 11కి వాయిదా

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీని ప్రాంతీయ పార్టీ తెరాసలో విలీనం చేయడం చట్టవిరుద్ధమైతే ఆ విలీనాన్ని రద్దు చేస్తామని, ఆ అధికారం తమకుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు విచారించాల్సినంత అత్యవసరమేమీ ఇందులో లేదంటూ విచారణను జూన్‌ 11కి వాయిదా వేసింది. కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ  చేపట్టాల్సిన పరిస్థితి లేదన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ వాదనలు వినిపిస్తూ ఇప్పటికే శాసనమండలిలో ఎమ్మెల్సీలను విలీనం చేసుకున్నారని, ఇప్పుడు ఎమ్మెల్యేల విషయంలోనూ అదే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

ధర్మాసనం జోక్యం చేసుకుంటూ విలీనం అయినంత మాత్రాన ఇప్పటికిప్పుడు జరిగే నష్టం లేదని, అది చట్టవిరుద్ధమైతే దాన్ని రద్దు చేస్తామని, గతంలో ఉన్న పరిస్థితిని పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది.

ఒత్తిడి ఉంది.. అర్థం చేసుకోండి
ప్రస్తుతం కేసుల విచారణలో న్యాయమూర్తులపై ఒత్తిడి ఉందని, అర్థం చేసుకోవాలని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ‘‘న్యాయమూర్తులకు కేవలం ఇక్కడ కేసుల విచారణ ఒక్కటే కాదు. ఇతర బాధ్యతలూ ఉంటాయి. సెలవుల్లో కూడా విచారించాలంటే అదనపు ఒత్తిడి ఉంటుంది. మేము రోబోలం కాదు. మనుషులమే. కొద్దిగా విశ్రాంతి అవసరం. సహచర న్యాయమూర్తులు గాయపడినప్పటికీ విధుల్లో పాలుపంచుకుంటున్నారు. ఇప్పటికీ ఉదయం విచారణకు వచ్చే కేసుల వివరాలను చదువుకోవడానికి తెల్లవారుజామున 3 గంటలకే నిద్ర లేవాల్సి వస్తోంది. రాత్రి అన్నీ పూర్తి చేసుకుని నిద్ర పోయేసరికి 11 గంటలవుతోంది. జూన్‌ తరువాత మంచి రోజులు రావచ్చు. కొత్త జడ్జీలు కూడా రావచ్చు. అదనంగా బెంచీలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలున్నాయి. అందువల్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల విలీన వ్యవహారంపై విచారణను జూన్‌ 11న చేపడతాం’’ అని ధర్మాసనం పేర్కొంది.

ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌లపై 8న
తెరాస తరఫున గెలిచి పార్టీ ఫిరాయించారన్న కారణంగా అనర్హత వేటు వేస్తూ శాసనమండలి అధ్యక్షుడు జనవరి 16న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎమ్మెల్సీలు కె.యాదవ్‌రెడ్డి, ఎస్‌.రాములునాయక్‌, భూపతిరెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్‌లపై మే 8న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.

ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌లపై 8న
తెరాస తరఫున గెలిచి పార్టీ ఫిరాయించారన్న కారణంగా అనర్హత వేటు వేస్తూ శాసనమండలి అధ్యక్షుడు జనవరి 16న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎమ్మెల్సీలు కె.యాదవ్‌రెడ్డి, ఎస్‌.రాములునాయక్‌, భూపతిరెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్‌లపై మే 8న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.