Home ఆంధ్ర ప్రదేశ్ అందుకే ‘ధోనీ రివ్యూ సిస్టం’ అనేది..!

అందుకే ‘ధోనీ రివ్యూ సిస్టం’ అనేది..!

విశాఖపట్నం : డీఆర్‌ఎస్‌ అంటే క్రికెట్‌ ప్రపంచానికి తెలిసింది.. డెసీషన్‌ రివ్యూ సిస్టం. కానీ భారత అభిమానులకు మాత్రం అది ‘ధోనీ రివ్యూ సిస్టం’. అంపైర్‌ నిర్ణయంపై అనుమానం ఉన్నప్పుడు ఆటగాళ్లు థర్డ్‌ అంపైర్‌ను సమీక్ష కోరే పద్ధతే డీఆర్‌ఎస్‌. ఈ పద్ధతిని సద్వినియోగం చేసుకోవడంలో మహేంద్రుడి తర్వాతే ఎవరైనా. ధోనీ రివ్యూ కోరాడంటే ఆ బ్యాట్స్‌మెన్‌ దాదాపు పెవిలియన్‌ చేరినట్లే. ఇలా ధోనీ డీఆర్‌ఎస్‌ దెబ్బకు బ్యాట్లు చంకలో పెట్టుకొని వెళ్లిపోయిన బ్యాట్స్‌మెన్‌ ఎంతోమంది ఉన్నారు. అందుకే డీఆర్‌ఎస్‌ను ధోనీ రివ్యూ సిస్టంగా పిలుస్తుంటారు. గతంలోనూ ధోనీ ఎన్నోసార్లు రివ్యూలను విజయవంతంగా వినియోగించుకున్నాడు. ధోనీ కోరిన రివ్యూల్లో 86 శాతం అతనికే అనుకూలంగా వచ్చాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సిస్టంను ధోనీ ఎంతలా ఉపయోగించుకుంటున్నాడో.

తాజాగా ఐపీఎల్‌-12 క్వాలిఫయర్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ధోనీ మరోసారి డీఆర్‌ఎస్‌తో మెరిశాడు. దీపక్‌ చాహర్‌ వేసిన బంతి బ్యాట్స్‌మన్‌ పృథ్వీషా ప్యాడ్స్‌కు తగిలింది. ఎల్బీ కోసం అప్పీల్‌ చేసినా మైదానంలో అంపైర్‌గా ఉన్న రవి ఔటివ్వలేదు. అయితే, చాహర్‌తో చర్చించిన ధోనీ.. క్షణాల్లో రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి వికెట్లను తాకుతున్నట్లు స్పష్టమైంది. దీంతో అంపైర్‌ దాన్ని ఔట్‌గా ప్రకటించాడు. పృథ్వీషా పెవిలియన్‌కు చేరుకున్నాడు.