Home ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల నిర్వహణకు మూడు మాసాలా?: జేపీ

ఎన్నికల నిర్వహణకు మూడు మాసాలా?: జేపీ

విశాఖ: దేశంలో సార్వత్రిక ఎన్నికలను మూడేసి నెలల పాటు నిర్వహించి ఓ పెద్ద ప్రహసనంలా చేస్తున్నారని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. లక్షల మంది సైన్యం, రక్షక దళాలు ఉంటేగానీ సార్వత్రిక ఎన్నికలు జరగవనే భ్రమలను కల్పిస్తుండటంతో ప్రజాస్వామ్యం హాస్యాస్పదంగా మారిందన్నారు. కెన్యా లాంటి దేశంలో ఒకేరోజులో అన్ని ఎన్నికలూ నిర్వహించి ఆ రోజు రాత్రే ఫలితాలు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చిన్న చిన్న దేశాలు ఒక్క రోజులో ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ఇస్తూ ఉంటే ఇక్కడ రూ.వేల కోట్లు ఖర్చుచేసి  నెలల పాటు ఎన్నికల కోడ్‌ అమలులో ఉంచడం వల్ల  దేశాభివృద్ధి ఆగిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై లోక్‌సత్తా పార్టీ ఆధ్వర్యంలో విశాఖలో బృంద చర్చ జరిగింది. ఈ చర్చలో జేపీతో పాటు మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ, భాజపా నేత విష్ణుకుమార్‌ రాజు తదితరులు పాల్గొని సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని తీర్మానించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ కమిటీ వేసి కార్యాచరణను ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు.