Home జాతీయం ‘ఎన్నికల నేపథ్యంలోనే ఆ కేసును తొక్కిపెట్టారు’

‘ఎన్నికల నేపథ్యంలోనే ఆ కేసును తొక్కిపెట్టారు’

కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ మాయావతి

లఖ్‌నవూ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీఎస్సీ అధినేత్రి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో సంచలనం రేపిన సామూహిక అత్యాచార కేసు విచారణని అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలోనే అక్కడి నాయకులు ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నికల సంఘం(ఈసీ) పనితీరుపైనా విరుచుకుపడ్డారు. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న నాయకులపై ఈసీ సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. 

రాజస్థాన్‌లో దళిత మహిళపై జరిగిన అత్యాచార ఘటనను ఎన్నికలు ముగిసే వరకు కాంగ్రెస్‌ తొక్కిపెట్టేందుకు ప్రయత్నించిందని మాయావతి ఆరోపించారు. ఈ విషయంలో బాధిత కుటుంబ సభ్యులను కూడా ఎంతో హింసించారన్నారు. ఈ విషయాన్ని బీఎస్పీ కార్యకర్తలు ఎంతో పోరాడి బయటికి తీసుకొచ్చినప్పటికీ.. కాంగ్రెస్‌ కంటితుడుపు చర్యలతో సరిపెట్టిందన్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కొంత మంది అంబేడ్కర్‌ పేరిట సంఘాలు స్థాపించి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారన్నారు. దీంతో కొన్ని పార్టీలకు కొమ్ము కాసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గత నెలలో రాష్ట్రంలోని అల్వార్‌ జిల్లాలో ఓ దళిత వివాహితపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించి నేరస్థులకు శిక్ష పడేలా చేయకుండా, ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్‌ దాచిపెట్టే ప్రయత్నం చేసిందని విపక్షాలు ధ్వజమెత్తాయి.