Home అంతర్జాతీయం కాబుల్‌లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురు మృతి

కాబుల్‌లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురు మృతి

కాబుల్‌ (అఫ్గానిస్థాన్‌): అఫ్గానిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుడులో ఆరుగురు చనిపోయారు. కాబుల్‌లోని మిలిటరీ అకాడమీ లక్ష్యంగా ఈ ఆత్మాహుతి దాడి జరిగినట్లు దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు. గురువారం జరిగిన ఈ పేలుడులో మరో ఆరుగురు కూడా గాయాలపాలైనట్లు పేర్కొన్నారు. పశ్చిమ కాబుల్‌లోని మాషల్‌ ఫహీమ్‌ అకాడమీ సమీపంలో ఓ జవాను అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని గమనించాడని, దగ్గరికి వెళ్లి ప్రశ్నించగా తనను తాను పేల్చేసుకున్నాడని వివరించారు. ఈ బాంబు పేలుడు దుర్ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నట్లు కాబుల్‌ పోలీస్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు.
అయితే, ఈ ఆత్మాహుతి పేలుడుకు తామే కారణమని ఇంతవరకూ ఏ ఉగ్ర సంస్థా ప్రకటించుకోలేదు. గతంలో ఈ మిలిటరీ అకాడమీ లక్ష్యంగా దాడులు జరిగిన దాఖలాలు ఉన్నాయి. మరోవైపు ఇస్లామిక్‌ స్టేట్‌, తాలిబన్‌ ఉగ్ర సంస్థలు చాలా కాలంగా కాబుల్‌లో చురుగ్గా ఉన్నాయి. గతంలోనూ అనేక చోట్ల ఈ ఉగ్రసంస్థలే పేలుళ్లకు పాల్పడ్డాయి.