Home Uncategorized కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు…

కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు…

ఇంటర్నెట్‌ డెస్క్‌: నరేంద్రమోదీ మంత్రివర్గంలో తెలంగాణ రాష్ట్రం నుంచి సికింద్రాబాద్‌ ఎంపీ గంగాపురం కిషన్‌రెడ్డికి చోటు లభించింది. మోదీతో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా.. కిషన్‌రెడ్డికి ఫోన్‌లో సమాచారం అందించారు. దీంతో ఆయన హస్తినకు పయనమయ్యారు. ఈ రోజు రాత్రి రాష్ట్రపతి భవన్‌లో కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కిషన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో రాష్ర్ట పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాం నెలకొంది. కిషన్‌రెడ్డికి ఏ శాఖ అప్పగిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. సామాన్య కార్యకర్తగా పార్టీలో చేరిన కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని ఓసారి అవలోకిస్తే..

అంచెలంచెలుగా ఎదిగి..
భారతీయ జనతాపార్టీలో కిషన్‌రెడ్డిది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. 1960లో రంగారెడ్డి జిల్లాలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. జయప్రకాశ్‌ నారాయణ్‌ స్ఫూర్తితో జనతాపార్టీలో యువ కార్యకర్తగా 1977లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 1980లో భాజపాలో పూర్తికాలం కార్యకర్తగా చేరారు. 1980 నుంచి 81 వరకు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు. 1982 నుంచి 83 వరకు బీజేవైఎం కోశాధికారిగా పనిచేశారు. 1986 నుంచి 90 వరకు ఉమ్మడి రాష్ట్రానికి బీజేవైఎం అధ్యక్షుడిగా  పనిచేశారు. 1990 నుంచి 92 వరకు బీజేవైఎం అఖిలభారత కార్యదర్శిగా పనిచేశారు. 1992 నుంచి 94 వరకు జాతీయ ఉపాధ్యక్షుడిగా, 1994 నుంచి 2001 వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2001 నుంచి 2002 వరకు భాజపా రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారు. 2002లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి నియమితులయ్యారు.

హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా గుర్తింపు!
2003 నుంచి 2005 వరకు భాజపా రాష్ట్ర అధికారప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2004లో హిమాయత్‌నగర్‌ శాసనసభ స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్‌విభజనలో భాగంగా హిమాయత్‌నగర్‌ అసెంబ్లీ స్థానం అంబర్‌పేటలోకి వచ్చింది. 2009, 2014లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2004, 2009, 2014లో వరుసగా గెలుపొంది హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. శాసనసభలో భాజపా పక్షనేతగా కిషన్‌రెడ్డి పనిచేశారు. 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 

ఓటమే ఆయనకు వరమైంది!
రాష్ర్ట విభజన అనంతరం తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా 2014 నుంచి 2016 వరకు పనిచేశారు. 2018లో జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికల్లో  తెరాస అభ్యర్థి చేతిలో 1,116 ఓట్ల తేడాతో కిషన్‌ రెడ్డి ఓడిపోయారు. నాలుగు మాసాల అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కిషన్‌ రెడ్డి సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి అధికార తెరాస అభ్యర్థిపై 62,144 ఓట్ల మోజార్టీతో విజయం సాధించారు. నేడు కొలువుదీరనున్న కేంద్రమంత్రి వర్గంలో కిషన్‌రెడ్డి స్థానం సంపాదించుకున్నారు.