Home జాతీయం కిషన్‌రెడ్డి జీ.. దిల్లీకి రండి: అమిత్‌షా ఫోన్‌

కిషన్‌రెడ్డి జీ.. దిల్లీకి రండి: అమిత్‌షా ఫోన్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో చోటు ఖాయమైంది. ఈ మేరకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆయనకు ఫోన్‌ చేసి దిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. గురువారం రాత్రి 7 గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.  రాష్ట్రపతి భవన్‌ ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మోదీతో ప్రమాణం చేయించనున్నారు. అనంతరం పలువురు నేతలు కూడా కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి సీనియర్‌ నేతగా ఉన్న కిషన్‌రెడ్డికి అవకాశం దక్కింది. గతంలో అంబర్‌పేట ఎమ్మెల్యేగా ఆయన సేవలందించారు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసి తెరాస అభ్యర్థి సాయికిరణ్‌ యాదవ్‌పై కిషన్‌రెడ్డి విజయం సాధించారు.

కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కిన విషయాన్ని కిషన్‌రెడ్డి ధ్రువీకరించారు. ఈ రాత్రి 7 గంటలకు నూతన బాధ్యతలు చేపట్టబోతున్నానని.. దీనికి ప్రధాని నరేంద్రమోదీ ఆశీర్వాదం, సికింద్రాబాద్ ప్రజల సహకారమే కారణమని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రోత్సాహం, ఆదరణ ఇదేవిధంగా కొనసాగాలని కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు.