దిల్లీ: ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిందంబరం, ఆయన తనయుడు శివగంగ ఎంపీ కార్తీ చిదంబరానికి మరోసారి ఊరట లభించింది. అరెస్టు నుంచి మినహాయింపునిస్తూ దిల్లీ కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు గడువు పొడగించింది. ఎయిర్సెల్-మ్యాక్సిస్ లావాదేవీల్లో అక్రమ నగదు చలామణి పేరిట చిదంబరం, ఆయన తనయుడిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. చిదంబరంతో పాటు మరికొంతమందిని ఈ కేసులో ఈడీ నిందితులుగా చేర్చింది. ఈ కేసులో అరెస్టు నుంచి మినహాయింపునిస్తూ కోర్టు గతంలో మే 6న వరకు గడువు పొడగించిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ, ఈడీలు తనను అరెస్ట్ చేయకుండా మరోసారి చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు.
ఎయిర్ సెల్- మ్యాక్సిస్ ఒప్పందం, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం పాత్రపై ఆరోపణల వచ్చిన నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీ భారత్, యూకే, స్పెయిన్లలో కార్తికి చెందిన రూ.54కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతులు ఇప్పించడం కోసం అవినీతికి పాల్పడ్డారని కార్తిపై ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో చిదంబరం యూపీఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ కేసుపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి.
చిదంబరం దర్యాప్తునకు సహకరించడం లేదని ముందస్తు బెయిల్ రద్దు చేయాలని వాదిస్తూ.. ఆయన్ను కస్టడీకి అప్పగించాలని దర్యాప్తు సంస్థలు కోరుతున్నాయి.