Home జాతీయం జైట్లీ, సుష్మా లేని మోదీ 2.0?

జైట్లీ, సుష్మా లేని మోదీ 2.0?

ఈసారి ఆర్థిక, విదేశాంగ మంత్రులుగా ఎవర్ని చూడనున్నాం?

దిల్లీ:   2014.. దాదాపు పదేళ్ల తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీలో సీనియర్‌ నేతలకు కొదవే లేదు. అందునా అందరూ రాజకీయాల్లో తల పండిన వాళ్లే. ప్రజలు విశ్వాసాన్ని నిలుపుకోవాలన్నా, మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నా తొలి ఐదేళ్లు ఆ పార్టీకి ఎంతో అవసరం. మంత్రుల ఎంపికలోనూ ప్రధాని ఆచితూచి అడుగువేయాలి. కీలక హోం, ఆర్థిక, రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలను సమర్థులకే అప్పగించాలి. ఆర్థిక మంత్రిగా ఎవర్ని తీసుకోవాలని మోదీ పడుతున్న సంఘర్షణకు అరుణ్‌ జైట్లీ రూపంలో సమాధానం దొరికింది. ఇక పొరుగు దేశాలతో సఖ్యత విషయంలో ధీటైన వారికే విదేశీ వ్యవహారాల బాధ్యతలు అప్పగించాలి. ఆ సమయంలో భాజపాకు సుష్మా స్వరాజ్‌ ఆశా కిరణంలా కనిపించారు. మారు ఆలోచించకుండా పార్టీ నేతలతో చర్చించి వీరిద్దరికీ కీలక శాఖలు కట్టబెట్టారు. తమను నమ్మి కీలక బాధ్యతలు అప్పజెప్పినందుకు జైట్లీ, సుష్మా కూడా తాము నిర్వహించిన శాఖలకు 100% న్యాయం చేశారు.

కొన్ని విధానాలు..మరికొన్ని వివాదాలు
ఆర్థిక మంత్రిగా అరుణ్‌ జైట్లీ బాధ్యతలు చేపట్టాక భారత ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. కొన్ని వివాదాస్పదమైనప్పటికీ మరి కొన్ని భారత ఆర్థిక రంగ ఔన్నత్యాన్ని చాటి చెప్పాయి.

* 2016 నవంబరు 8న అనూహ్యంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక 2017 జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్ను కూడా ఎన్నో విమర్శలకు దారితీసింది
* 2015లో తీసుకు వచ్చిన గోల్డ్‌ మోనిటైజేషన్‌ పథకానికి మంచి స్పందన వచ్చింది. ప్రజల వద్ద ఉన్న బంగారాన్ని ప్రభుత్వం వద్ద దాచిపెట్టుకుంటే దానికి తగిన వడ్డీ చెల్లిస్తారు. షార్ట్‌ టర్మ్‌, మీడియం టర్మ్‌, లాంగ్ టర్మ్‌ ఇలా మూడు విధాలుగా ఉంటుంది. ఈ టర్మ్‌ల ప్రకారం బంగారాన్ని వెనక్కి తీసుకోవాలంటే అప్పుడున్న రేట్లకు అనుగుణంగా అంత విలువ చేసే నగదు లేదా బంగారం తిరిగి ఇస్తారు.
* బ్యాంకులకు రూ. వేలకోట్లు ఎగనామం పెట్టిన వారి ఆటకట్టించేందుకు పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టాన్ని తీసుకు వచ్చారు. దీని ద్వారా విదేశాలకు పారిపోయిన రుణ ఎగవేత దారులకు ఆర్థిక నేరస్థుడు అనే ముద్ర పడుతుంది. సదరు వ్యక్తికి రుణం ఇవ్వడానికి ఇక ఏ బ్యాంకూ ముందుకు రావు.
* రుణ ఎగవేత దారుల యావదాస్తులను బ్యాంకులు జప్తు చేసేందుకు వీలుగా దివాలా చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టంతో రుణ ఎగవేత దారుల ఆస్తులను అమ్మి లేదా వేలం వేసి బాధితులకు రుణం చెల్లిస్తారు.

విదేశాల్లోని భారతీయులకు అమ్మ…
సుష్మా స్వరాజ్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు బాగా దగ్గరయ్యారు. ఆమె వాక్చాతుర్యం, ఆహార్యం ఇట్టే అవతలి వారిని కట్టిపడేస్తాయి. అందుకే ఆమెను నెటిజన్లు విపరీతంగా ఫాలో అవుతారు. నిజానికి విదేశీ వ్యవహారాలు చూసుకోవాల్సిన వారిలో ఉండే లక్షణాలన్నీ సుష్మలో కొట్టొచ్చినట్లు కనిపించేవి. ఇక ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వాటిలో కొన్ని..

* రూ. వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న వారిని స్వదేశానికి తెచ్చేందుకు సుష్మ పడిన శ్రమ అంతా ఇంతా కాదు. రికార్డు స్థాయిలో ఐదేళ్లలో 18 మందిని వెనక్కి తీసుకొచ్చారు.
* ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడ ఇబ్బందులు పడుతున్నట్లు సుష్మకు తెలిస్తే వెంటనే స్పందించే వారు. సంబంధిత ప్రభుత్వంతో మాట్లాడి వారినికి వెనక్కి పిలిపించేవారు. ఈ విషయమై ట్విటర్‌లో ఎవరు ఎలాంటి అభ్యర్థన చేసినా ఆమె వెంటనే స్పందించేవారు.
* ఇక విదేశాల్లో గృహ హింస ఎదుర్కొంటున్న భారతీయ మహిళల కోసం స్త్రీ శిశు సంక్షేమ శాఖతో కలిసి సుష్మ చొరవ తీసుకుని చట్టాన్ని తీసుకు వచ్చారు. దీని ప్రకారం సదరు వ్యక్తి గృహ హింస పెట్టినట్లు తేలితే అతడి వీసా రద్దు చేస్తారు. దీంతో పాటు భారత్‌లో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు. 
* ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో విదేశాంగ మంత్రిగా సుష్మ తొలి విజయాన్ని అందుకున్నారు. ఇరాన్‌, సిరియాలోని ఐసిస్‌ చెరలో చిక్కుకున్న 46 మంది భారతీయ నర్సులను సుష్మా విడిపించి స్వదేశానికి తీసుకొచ్చారు.
ప్రధాని మోదీ తొలి ప్రభుత్వంలో ఇన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఈ ఇద్దరి స్థానాన్ని కొత్త ప్రభుత్వంలో ఎవరు భర్తీ చేస్తారో చూడాలి.