Home Uncategorized ‘పబ్జీ’ ఆడుతూ కుప్పకూలిన యువకుడు

‘పబ్జీ’ ఆడుతూ కుప్పకూలిన యువకుడు

ఇండోర్‌ : ఆరుగంటలపాటు నిరంతరాయంగా ‘పబ్జీ’ గేమ్‌ ఆడిన ఓ యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ఆదివారం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని నీముచ్‌లో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫర్ఖాన్‌ ఖురేషి  అనే విద్యార్థి  12వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం భోజనం ముగించుకొని పబ్జీ ఆడుతూ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.  దీంతో హుతాశయులైన కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు ప్రకటించారు. దీనిపై కార్డియాలజిస్ట్ డాక్టర్‌ అశోక్‌ జైన్‌ మాట్లాడుతూ..  ఆస్పత్రికి వచ్చేసరికే బాలుడి పల్స్‌ పడిపోయిందన్నారు. బతికించాలని ప్రయత్నించినా లాభం లేకపోయిందని  వ్యాఖ్యానించారు. చనిపోయిన యువకుడు మంచి స్విమ్మర్‌ అని, ఆరోగ్యంగానే  ఉండేవాడని కుటుంబ సభ్యులు చెప్పారని డాక్టర్‌  జైన్‌ పేర్కొన్నారు. వీడియోగేమ్‌లో అమితంగా భావావేశాలకు లోను కావడం మూలంగా గుండెపోటు వచ్చే ఆస్కారం ఉందని, పిల్లలు ఎవరైనా సరే అలాంటి ఉత్సుకత రేకెత్తించే ఆటలకు దూరంగా  ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

దీనిపై మృతుడి సోదరి ఫైజా ఖురేషీ మాట్లాడుతూ.. ‘ఘటన జరిగిన సమయంలో నేను మా సోదరుడి పక్కనే కూర్చున్నాను. ఆ సమయంలో మిత్రులతో కలసి ఫర్ఖాన్‌ పబ్జీ ఆడుతున్నాడు.  ఉన్నట్టుండి పేల్చండి..పేల్చండి అంటూ అరవడం మొదలుపెట్టాడు. తరువాత  ఏడుస్తూ తన చెవిలోని ఇయర్‌ఫోన్స్‌, మొబైల్‌ విసిరేసి ‘అయాన్‌ నేను నీతో ఆడను, నీవల్లే నేను ఓడిపోయాను’ అంటూ కుప్పకూలిపోయాడని తెలిపింది.

 ఫర్ఖాన్‌ మరో సోదరుడు మహ్మద్‌ హాసిమ్‌ మాట్లాడుతూ.. గతంలో తాను కూడా  18గంటలు పబ్జీ ఆడానని, అయితే సోదరుడి మరణం తర్వాత ఫోన్‌లో నుంచి ఆ ఆటను తొలగించానని చెప్పాడు. ఫర్ఖాన్‌ మరణం గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.