Home జాతీయం నన్ను సాగనంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు

నన్ను సాగనంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు

అమృత్‌సర్‌: పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఆశించిన మేర స్థానాలు రాకపోవడానికి తనని బాధ్యుడిని చేయడంపై ప్రముఖ మాజీ క్రికెటర్‌ ఆ రాష్ట్రమంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌పై విరుచుకుపడ్డారు. తనని పార్టీ నుంచి సాగనంపడానికి కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందన్నారు. కానీ, తనని మాత్రమే లక్ష్యం చేయడం వల్ల వచ్చే లాభమేమీ లేదని అభిప్రాయపడ్డారు. ‘‘బటిండాలో గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్‌ ఎప్పుడూ గెలవలేదు. ముఖ్యమంత్రితో పాటు ఆయన కుమారుడు కూడా ఓటమి పాలయ్యారు. ఇప్పటి వరకు అనేక సార్లు నన్ను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేశారు. కర్తార్‌పూర్‌ లాంటి అంశాల్లో నన్ను నిందితుడిగా చూపే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంలో ఉన్న కొంత మంది నన్ను బయటికి సాగనంపాలని చూస్తున్నారు. ఇప్పటి వరకు నేను ఎవ్వరి పేర్లు బయటపెట్టలేదు. కానీ పరిస్థితులు చేదాటి పోతున్నాయి’’ అని సిద్ధూ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. 

ప్రభుత్వంలో మొత్తం 50శాఖలు ఉన్నప్పటికీ కేవలం తన శాఖ పనితీరుపైనే ఆరోపణలు చేయడాన్ని సిద్ధూ తప్పుబట్టారు. తాను బాధ్యతలు చేపట్టిన నాటికి స్థానిక ప్రభుత్వాల శాఖ పరిస్థితి దారుణంగా ఉండేదని వ్యాఖ్యానించారు. అలాంటి శాఖలో దాదాపు రూ.6000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. సిద్ధూ తనకు అప్పగించిన శాఖను సమర్థంగా నిర్వహించలేకపోయారని.. అందువల్లే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ అనుకున్న మేర ఫలితాలు సాధించలేకపోయిందని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళతానని.. వీలైతే సిద్ధూకి కేటాయించిన శాఖను మారుస్తామని ఆయన అన్నారు. దీనిపై స్పందించిన ఆయన భార్య సిద్ధూ లేకుంటే పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. తాజాగా సిద్ధూ కూడా అమరీందర్‌ వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు.