Home Uncategorized మార్కెట్లపై ‘మోదీ కేబినెట్‌’ ఎఫెక్ట్‌

మార్కెట్లపై ‘మోదీ కేబినెట్‌’ ఎఫెక్ట్‌

ముంబయి: కేంద్రమంత్రుల శాఖల కేటాయింపు ప్రభావంతో దేశీయ మార్కెట్లు శుక్రవారం ఒడుదొడుకుల్లో సాగాయి. కొనుగోళ్ల అండతో ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు.. కేబినెట్‌ కూర్పు తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్‌లో చాలా సేపు ఊగిసలాడిన సూచీలు చివరకు కాస్త కోలుకున్నా.. నష్టాలు తప్పలేదు.

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావం, విదేశీ పెట్టుబడులు పెరగడం, కొనుగోళ్ల అండతో ఈ ఉదయం సూచీలు సరికొత్త రికార్డులతో ప్రారంభమయ్యాయి. మార్కెట్‌ ఆరంభంలో 200 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్‌ ప్రతిష్ఠాత్మక 40వేల మార్క్‌ను దాటి ట్రేడ్‌ అయ్యింది. అటు నిఫ్టీ కూడా 12వేల మార్క్‌పైన కదలాడింది. అయితే మధ్యాహ్నం సమయంలో మోదీ కేబినెట్‌ శాఖల కేటాయింపుతో సూచీలు ఒక్కసారిగా ఒడుదొడుకులకు గురయ్యాయి. నిర్మలాసీతారామన్‌కు ఆర్థికమంత్రి బాధ్యతలు ఇవ్వడంపై మదుపర్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దీనికి తోడు లోహ, ఆర్థిక రంగాల షేర్లు కుదేలవడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. 

ఒక దశలో సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. అయితే చివర్లో ఐటీ రంగ షేర్లలో మళ్లీ కొనుగోళ్లు జరగడంతో సూచీలు కాస్త కోలుకున్నా లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 118 పాయింట్లు నష్టపోయి 39,714 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో 11,923 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.81గా కొనసాగుతోంది. టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, బ్రిటానియా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ షేర్లు లాభపడగా.. యస్‌ బ్యాంక్‌, ఐటీసీ, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, వేదాంతా, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ షేర్లు నష్టపోయాయి.