Home ఆంధ్ర ప్రదేశ్ రవిప్రకాశ్‌ కోసం గాలింపు ముమ్మరం

రవిప్రకాశ్‌ కోసం గాలింపు ముమ్మరం

హైదరాబాద్‌: టీవీ 9 సంస్థ వాటాల వివాదంలో కేసుల పాలైన ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కోసం సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు బృందాలు గాలింపు తీవ్రతరం చేశాయి. తాము ఇచ్చిన నోటీసులకు రవిప్రకాశ్‌ నుంచి స్పందన లేకపోవడంతో ఏ క్షణమైనా అరెస్ట్‌ చేసే దిశగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వాటాల వివాదంలో రవిప్రకాశ్‌పై కేసులు నమోదైనప్పటి నుంచి ఆయన్ని విచారించేందుకు పోలీసులు పలు సందర్భాల్లో ప్రయత్నించి విఫలమయ్యారు. సైబర్‌క్రైమ్‌ ఠాణాకు హాజరై వివరణ ఇవ్వాలని పోలీసులు తొలుత 160 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చారు. వాటికి స్పందించక పోవడంతో 41సీఆర్పీసీ నోటీసులు జారీచేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు తప్పుడు కేసులు పెట్టారంటూ రవిప్రకాశ్‌ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.  తొలుత రవిప్రకాశ్‌ ఏపీలోని ఓ రిసార్టులో ఉన్నారనే సమాచారంతో కొద్దిరోజుల క్రితం అక్కడికి పోలీసులు వెళ్లారు. అయితే అక్కడి నుంచి బెంగళూరు వెళ్లిన రవిప్రకాశ్‌..తర్వాత గుజరాత్‌ వెళ్లారనే సమాచారంతో అక్కడా తనిఖీలు చేశారు. తాజాగా రవిప్రకాశ్‌ మళ్లీ బెంగళూరుకే చేరుకున్నారనే సమాచారంతో ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయి. రవిప్రకాశ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు హైకోర్టులో చుక్కెదురు కావడంతో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఇదే కేసులో సహ నిందితుడిగా ఉన్న సినీనటుడు శివాజీ కోసమూ పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.