Home జాతీయం సోనియానా.. రాహుల్‌గాంధీనా..?

సోనియానా.. రాహుల్‌గాంధీనా..?

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ లీడర్‌పై వీడని సందిగ్ధత

దిల్లీ: కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే మరోసారి ఎన్నుకుంటారా.. లేదా ఆ బాధ్యతలను రాహుల్‌గాంధీకి అప్పగిస్తారా.. అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. లోక్‌సభకు ఎన్నికైన కాంగ్రెస్‌ ఎంపీలు శనివారం భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే పార్టీ పార్లమెంటరీ పక్ష నేతను ఎన్నుకునే అవకాశముంది. పార్లమెంట్‌ హాలులో జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరుకానున్నారు. 

ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై పార్టీ నేతలను ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో పార్టీకి నాయకత్వం వహించే బాధ్యతలను రాహుల్‌కు అప్పగించాలని కొందరు కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ సంప్రదాయం ప్రకారం.. సోనియాగాంధీనే పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా కొనసాగించాలని మరికొందరు అనుకుంటున్నారు. దీంతో ఈ విషయంపై సందిగ్ధత నెలకొంది.