Home Uncategorized కేశినేని నానికి చంద్రబాబు ఫోన్‌!

కేశినేని నానికి చంద్రబాబు ఫోన్‌!

అమరావతి: విజయవాడ ఎంపీ కేశినేని నానికి తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌ చేశారు. సాయంత్రం తన నివాసానికి రావాలని సూచించారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ నేతల నియామకం విషయంలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో కేశినేని నాని మనస్తాపానికి గురైనట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్నటి సమావేశంలో పార్టీ కట్టబెట్టిన పదవులపైనా నాని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌లో స్పందించారు.
‘‘లోక్‌సభలో పార్టీ విప్‌ పదవి ఇచ్చినందుకు అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు. నా కంటే సమర్థుడైన  వేరొకరిని ఆ పదవిలో నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అంత పెద్ద పదవి చేపట్టడానికి నేను అనర్హుడినని భావిస్తున్నా. విజయవాడ ప్రజలు నన్ను ఎంపీగా ఎన్నుకున్నారు. వారి ఆశీస్సులు నాకున్నాయి. పార్టీ ఇచ్చే విప్‌ పదవి కంటే ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతృప్తి ఇస్తుంది’’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కేశినేనిని కలిసి చర్చించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ సాయంత్రం తన నివాసానికి రావాలని సూచించారు.