Home Uncategorized పబ్‌జీ గేమ్‌ను నిషేధించాలి… ముస్లిం లీగ్ డిమాండ్..

పబ్‌జీ గేమ్‌ను నిషేధించాలి… ముస్లిం లీగ్ డిమాండ్..

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్ గేమ్ ‘ప్లేయర్ అన్‌నౌన్స్ బ్యాటిల్‌గ్రౌండ్స్ (పబ్‌జీ)పై నిషేధం విధించాలని తమిళనాడు ముస్లిం లీగ్ (టీఎన్ఎంఎల్) డిమాండ్ చేసింది. ఈ గేమ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆరోపించింది. ఈ మేరకు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో టీఎన్ఎంఎల్ ఫిర్యాదు చేసింది. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల ఆగ్రహానికి ఈ గేమ్ కారణమవుతోంది. విద్యార్ధుల ఆత్మహత్యలకు కారణమైన ‘బ్లూ వేల్ చాలెంజ్’ గేమ్ మాదిరిగానే… ఇది కూడా పవిత్ర స్థలం ‘కాబా’ను పోలిన ఓ చిత్రాన్ని చెడుగా చూపిస్తూ ఆగ్రహానికి గురిచేస్తోంది…’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముస్లింల పవిత్ర క్షేత్రం మక్కా మసీదు మధ్యలో ఉండే పవిత్ర భవనమే ‘కాబా’. కాగా ముస్లింలంతా ఈ గేమ్‌ను తమ మొబైల్‌లో డిలీట్ చేస్తూ ‘‘బాయ్‌కాట్ పబ్‌జీ’’ పేరుతో ప్రచారం చేపట్టాలని టీఎన్ఎంఎల్ పిలుపునిచ్చింది. ఈ మేరకు సదరు సంస్థ వివిధ మెసేజింగ్ యాప్‌లలో పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.