Home Uncategorized పరిషత్‌ ఫలితాల్లో హింస: ఇద్దరి మృతి

పరిషత్‌ ఫలితాల్లో హింస: ఇద్దరి మృతి

మహాబూబ్‌నగర్‌ నేరవిభాగం: మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన ఘర్షణలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దేవరకద్ర మండలంలోని డోకూరులో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మంగళవారం పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఓ పార్టీకి చెందిన వ్యక్తి గెలుపొందగా..విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సంబరాల్లో మరో వర్గం వారితో గొడవ జరిగిందని, వారే కొట్టి చంపినట్లుగా భావిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. చనిపోయిన యువకుడిని ప్రేమ్‌ కుమార్‌గా గుర్తించారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

మహిళ మృతి, ముగ్గురికి గాయాలు
మహాబూబ్‌నగర్ గ్రామీణ మండలంలోని రామచంద్రాపూర్‌ గ్రామంలో అర్ధరాత్రి  జరిగిన మరో ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గెలవడంతో యువకుల మధ్య గొడవ జరిగింది. ఈఘర్షణలో మహిళ మృతిచెందగా..ముగ్గురికి గాయాలయ్యాయి. మృతదేహాన్ని శవపరీక్షకు తరలిస్తుండగా..గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో మరోసారి ఘర్షణ చెలరేగింది. నిందితులను అరెస్టు చేసే వరకూ మృతదేహాన్ని తరలించవద్దంటూ స్థానికులు పట్టుబట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మృతదేహంతో ధర్నా చేపట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో పికెటింగ్‌ నిర్వహిస్తున్నారు.