Home Uncategorized వెంకటేశ్‌తో ఆ సినిమా చేస్తున్నాం: సురేశ్‌బాబు

వెంకటేశ్‌తో ఆ సినిమా చేస్తున్నాం: సురేశ్‌బాబు

హైదరాబాద్: తన సోదరుడు విక్టరీ వెంకటేశ్‌తో ఓ బాలీవుడ్‌ సినిమాను రీమేక్‌ చేస్తున్నామని ప్రకటించారు ప్రముఖ నిర్మాత సురేశ్‌ బాబు. గురువారం ఆయన తండ్రి డి.రామానాయుడు జయంతి. ఆయన స్థాపించిన సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఇటీవల 55 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో సురేశ్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నిర్మిస్తున్న తదుపరి సినిమాల గురించి మాట్లాడారు.
మనవి ఇప్పటికీ పాత పద్ధతులే..
హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ స్థాయిలో మనకు సదుపాయాలు ఉన్నాయి. కానీ వాటిలో నాణ్యత మన సినిమాల్లో కనిపించదు. అందుకు కారణం మనం సినిమా తీసే విధానమే. ప్రపంచమంతా ముందుకు వెళుతున్నా… మనం సినిమాలు తీయడంలో మాత్రం ఇప్పటికీ పాత పద్ధతుల్నే అనుసరిస్తున్నాం. ఆ పద్ధతులు మారినప్పుడు మన సినిమాల్లో నాణ్యత పెరుగుతుంది. 
నాకు అన్నీ తెలుసని చెప్పడంలేదు
నేను చాలా సినిమాలు చేశాను కాబట్టి నాకు అన్నీ తెలుసని కాదు. ఒక నిర్మాతకి తెలియాల్సిన దాంట్లో నాకు 60 శాతం మాత్రమే తెలుసు. మిగిలింది నేను కూడా ఎవరి దగ్గరైనా నేర్చుకొని సినిమాలు చేయాల్సిందే. నేర్చుకొని సినిమా చేయడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. ఇకపై మా సంస్థలో ప్రతి సినిమాకి ముందు, ఆ సినిమాకి పనిచేసే బృందానికి ప్రత్యేకంగా శిక్షణ తరగతుల్ని ఏర్పాటు చేయబోతున్నాం. అది పూర్తయ్యాకే సినిమా మొదలు పెడతాం. బయట నుంచి వచ్చే దర్శక, నిర్మాతలు, చిత్రబృందాలకి కూడా సినిమాపైన, సాంకేతికతపైన అవగాహన పెంపొందించేలా శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేయబోతున్నాం.