Home Uncategorized ‘అయోధ్య’పై మధ్యవర్తిత్వం నివేదిక

‘అయోధ్య’పై మధ్యవర్తిత్వం నివేదిక

రేపు విచారణ జరపనున్న సుప్రీంకోర్టు

దిల్లీ: అయోధ్యలోని రామ జన్మభూమి – బామ్రీ మసీదు భూవివాదంలో సామరస్య పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం చేపట్టిన ముగ్గురు సభ్యుల కమిటీ నేడు సర్వోన్నత న్యాయస్థానికి నివేదిక సమర్పించింది. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం కోసం కోర్టు ఇచ్చిన గడువు జులై 31తో ముగిసింది. దీంతో జస్టిస్‌ ఖలీఫుల్లా నేతృత్వంలోని కమిటీ నేడు నివేదికను సీల్డ్‌ కవర్‌లో సమర్పించింది. దీనిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం విచారణ జరపనుంది. రోజువారీ విచారణ చేపట్టాలా వద్దా అన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది. 

అయోధ్య వివాదంలో సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించడానికి అవకాశముంటే సూచించాలని ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎఫ్‌.ఎం.ఖలీఫుల్లా, ‘‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌, ప్రముఖ సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ పంచు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అయితే మధ్యవర్తిత్వ ప్రక్రియలో పురోగతి చోటుచేసుకోవడం లేదని, దాన్ని రద్దు చేసి న్యాయస్థానమే విచారణ జరపాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో ఇటీవల పిటిషన్‌ దాఖలైంది.

ఈ పిటిషన్‌పై జులై 11న విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. మధ్యవర్తిత్వ ప్రక్రియలో ఇప్పటి వరకు చోటుచేసుకున్న పురోగతిని తెలియజేస్తూ జులై 18లోగా తమకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం కమిటీ పురోగతి నివేదిక అందించింది. దీన్ని పరిశీలించిన ధర్మాసనం.. జులై 31 వరకు మధ్యవర్తిత్వం కొనసాగించి ఆగస్టు 1న నివేదిక ఇవ్వాలని సూచించింది. మధ్యవర్తిత్వ కమిటీతో సామరస్య పరిష్కారం సాధ్యం కాకపోతే తామే రంగంలోకి దిగి రోజువారీ విచారణ చేపడతామని కోర్టు ఇదివరకే స్పష్టం చేసింది.