Home జాతీయం ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి..!

ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి..!

ఎన్నికల బరిలో దిగనున్న ఉద్దవ్‌ తనయుడు

ముంబయి: శివసేన చరిత్రలో తొలిసారిగా ఠాక్రే కుటుంబం నుంచి ఓ వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో పోటీ చేయనున్నారని తెలిసింది. వర్లి అసెంబ్లీ స్థానం అతడిని పోటీకి దింపాలని పార్టీ యోచిస్తోందని సమాచారం. గతంలో అదే స్థానంలో పోటీ చేసి గెలుపొందిన ఎన్సీపీ ముంబయి యూనిట్‌ చీఫ్‌ సచిన్‌ అహిర్‌ ఇటీవలే శివసేనలో చేరారు. దీంతో ఆ స్థానం నుంచి పోటీ విషయంలో ఆదిత్య ఠాక్రేకు మార్గం సుగమమైంది.

ప్రస్తుతం యువసేన అధ్యక్షుడిగా ఉన్న 25 ఏళ్ల ఆదిత్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా జన్‌ఆశిర్వాద్‌ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి సీఎం అభ్యర్థిగా ముందుపెట్టి ప్రజల్లోకి వెళ్లాలని ఆ పార్టీ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటి వరకు సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికల బరిలో నిలిచిన శివసేన.. ఈ సారి వ్యూహం మార్చినట్లు దీనిబట్టి  తెలుస్తోంది.

మరోవైపు ఆదిత్యను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే భాజపాతో ఉన్న 30 ఏళ్ల అనుబంధానికి తెరపడినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏళ్లుగా ఈ రెండు పార్టీలు కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు కొన్ని రోజులు కత్తులు దూసినా అనంతరం మళ్లీ కలిసే పోటీ చేశాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వేరువేరుగా పోటీ చేసినప్పటికీ కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఒకే ప్రభుత్వంలో ఉన్నప్పటికీ పరస్పరం ఈ రెండు పార్టీల నేతలు విమర్శలు చేసుకోవడం రివాజుగా మారింది. ఆదిత్యను తీసుకురావడం ద్వారా అటు సీట్ల ఒప్పందం విషయంలోనూ.. ఇటు సీఎం కుర్చీ వ్యవహారంలో ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు వస్తాయని భావిస్తున్నారు. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-భాజపా వేర్వేరుగా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.