Home Uncategorized ఠాక్రే.. టూర్‌ అందుకేనా?

ఠాక్రే.. టూర్‌ అందుకేనా?

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: బాల్‌ఠాక్రే.. శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు. 1996లో మహారాష్ట్రలో సేన-భాజపా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించిన నేత. అయితే ఆయన సీఎం పదవి కోరుకోలేదు. మరో నేత మనోహర్‌జోషీని నియమించారు. ఉద్దవ్‌ ఠాక్రే.. బాల్‌ఠాక్రే కుమారుడు. ప్రస్తుతం శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో భాజపా -సేన ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. అయితే ఎలాంటి మంత్రి పదవీ లేదు. అలాగే వారి బంధువు రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నిర్మాణ్‌సేన తరఫున ఆయన కూడా ఎప్పుడూ పోటీచేయకపోవడం గమనార్హం. ఇలా గత నాలుగు దశాబ్దాలుగా ఠాక్రే కుటుంబసభ్యులు ఎవరూ ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయలేదు. అయితే తొలిసారిగా శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే మాత్రం త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

వడివడిగా అడుగులు
ఆదిత్య ఠాక్రే శివసేన యువజన విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. 25 ఏళ్ల ఠాక్రే పార్టీ కార్యకలపాల్లో, వ్యూహాల్లో చురుగ్గా ఉంటారు. జన్‌ ఆశీర్వాదయాత్రతో ఆయన రాష్ట్ర ప్రజలకు దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారు. కొంకణ్‌, మరఠ్వాడా, ఉత్తర మహారాష్ట్రల్లో సేన బలంగా ఉంది. దీంతో పాటు ఇతర ప్రాంతాల్లో బలపడేందుకు యాత్ర చేపట్టినట్టు ప్రచారం జరుగుతున్నా సీఎం పదవిపై ఆయన కన్నేశారన్న వార్తలు జోరుగా వ్యాపిస్తున్నాయి.

30 ఏళ్ల బంధం..
రాష్ట్రంలో శివసేన-భాజపాలది 30 ఏళ్లకు పైగా స్నేహం. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండూ వేర్వేరుగా పోటీ చేశాయి. అనంతరం దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి సేన మద్దతు పలికింది. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ కూటమి భారీ విజయాలను నమోదుచేసింది.

కలిసి పోటీ చేయకుంటే..?
రాష్ట్రంలో భాజపాకు బాగా బలముంది. సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ పాలనకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో మిత్రపక్షమైన శివసేన రానున్న ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించనుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. రెండు పక్షాలు కూటమిగా పోటీచేస్తేనే విజయం లాభిస్తుందని లేకుంటే ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఎన్సీపీలు పైచేయి సాధిస్తాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 288. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీచేసిన భాజపాకు 122, శివసేనకు 63, కాంగ్రెస్‌కు 42, ఎన్సీపీకి 41 సీట్లు లభించాయి. అయితే రానున్న ఎన్నికల్లో భాజపా, శివసేనలు సగం సగం స్థానాలకు పోటీచేయాలని ఒప్పందం చేసుకున్నాయి. ఏ పక్షానికి ఎక్కువ సీట్లు వస్తే ఆ పక్షానికి చెందినవారే సీఎంగా బాధ్యతలు చేపడతారని ఇరు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.