Home ఆంధ్ర ప్రదేశ్ బందరు పోర్టును ఎంతకు అమ్మేశారు?

బందరు పోర్టును ఎంతకు అమ్మేశారు?

వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డ దేవినేని, కొల్లు

అమరావతి: ప్రభుత్వం మారగానే బందరు పోర్టు పనులు చేసే యంత్రాలు వెనక్కిపోయాయని మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్రలు మండిపడ్డారు. ప్రభుత్వ బెదిరింపులకి భయపడి ఆ నిర్మాణ సంస్థ వెనక్కి పోయిందని విమర్శించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బందరు పోర్టును తెలంగాణ ప్రభుత్వానికి ఎంతకు అమ్మేశారని దేవినేని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం క్విడ్ ప్రోకో ద్వారా  తెలంగాణకు ఇచ్చేసిందని విమర్శించారు. తమపై పదేపదే ట్వీట్లు పెట్టే విజయసాయి రెడ్డి.. ఇటీవల జరిగిన సెర్బియా అరెస్టులపై ఎందుకు ట్వీట్‌  చేయలేదని పరోక్షంగా నిమ్మగడ్డ ప్రసాద్‌ అరెస్టును ప్రస్తావించారు. బెయిల్‌పై తిరుగుతున్న ఆయన తమను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. బందరు పోర్ట్ పై సీఎం జగన్ ప్రకటన చెయ్యాలని డిమాండ్‌ చేశారు. బందరు పోర్టుపై  ప్రభుత్వం ఇచ్చిన రహస్య జీవోలను బహిర్గతం చేయాలని కొల్లు రవీంద్ర అన్నారు. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.