Home జాతీయం ‘మిస్టర్ పీఎం..సొరంగం చివరన వెలుగు లేదు’

‘మిస్టర్ పీఎం..సొరంగం చివరన వెలుగు లేదు’

ఆర్థిక వ్యవస్థ పనితీరుపై రాహుల్ విమర్శలు

దిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంపై వెలువడిన  మీడియా నివేదిక ఆధారంగా కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ మీద మరోసారి విమర్శలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థను రైలుతో పోలుస్తూ పట్టాలు తప్పిందని మండిపడ్డారు.  మాంద్యం అనే రైలు అడ్డూ అదుపు లేకుండా వేగంగా ముంచుకొస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అసమర్థ మంత్రని పేర్కొంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 

‘మిస్టర్‌ పీఎం, ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పింది. సొరంగం చివరన ఎలాంటి వెలుగులేదు. కానీ మీ ఆర్థిక మంత్రి వెలుగు ఉందని చెబుతున్నారు కానీ అది వేగంగా ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం రైలు వెలుగని’ అని ట్వీట్ చేయడంతో పాటు మీడియా కథనానికి సంబంధించిన లింక్‌ను పోస్ట్ చేశారు. 

జూన్‌ నెలలో ఎనిమిది ప్రధాన రంగాలకు చెందిన పరిశ్రమల వృద్ధి రేటు తగ్గిందనన్న అధికారిక డేటా వెలువడిన మరుసటి రోజే రాహుల్ కేంద్రంపై మాటల దాడి చేశారు. చమురు సంబంధిత, సిమెంటు రంగాల్లో ఉత్పత్తి తగ్గిపోవడంతో ఈ తగ్గుదల నమోదైందని ఆ డేటా వెల్లడించింది.